నిఘా నీడలో
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనానికి సర్వం సిద్ధమైంది. కడపలోని మున్సిపల్ హైస్కూల్ మెయిన్‌లో సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు సిద్ధం చేశారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 6 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమాధాన పత్రాలకు కోడింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ పేపర్ల మూల్యాంకనానికి జిల్లావ్యాప్తంగా 900 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరిలో జవాబు పత్రాలకు మూల్యాంకన నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జామినర్లతోపాటు వాటిని పరిశీలించేందుకు చీప్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్లను సిద్ధం చేశారు. ఈ మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ క్యాంపు ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. మూల్యాంకన కేంద్రంలో అన్ని గదులతోపాటు ఆవరణలో కూడా సీసీ కెమోరాలను ఏర్పాటు చేశారు. దీంతో మూల్యాంకన ప్రక్రియ మొత్తం నిఘా నీడలో జరగనుంది.
విడతల వారీగా..
ఈ ఏడాది వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,95,674 జవాబు పత్రాలను ఇక్కడ మూల్యాంకనం చేయ నున్నారు. ఇందుకోసం 900 మంది సబ్జెక్టు టీచర్లను విద్యాశాఖ నియమించింది. వీరికి మూల్యాంకన నిర్వహణపై శిక్షణను కూడా ఇచ్చారు.
నిబంధనలు ఇలా...
● ఉపాధ్యాయులు సెల్‌ఫోన్, స్మార్ట్‌ఫోన్లు, ఎరైజర్, వైట్నర్ తదితర వస్తువులను మూల్యాంకన కేంద్రంలోకి తీసుకువెళ్లరాదు
● ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు మూల్యాంకనం జరుగుతుంది. మూల్యాంకన కేంద్రంలో ఎటువంటి తప్పిదాలు జరిగినా ఉపాధ్యాయులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
● మూల్యాంకన కేంద్రంలో విధులకు హాజరయ్యే సిబ్బంది సమయానికి హాజరు కావాలి. లేకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
● మూల్యాంకనంలో పాల్గొనే సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేశారు. గుర్తింపు కార్డు ఉన్న వారినే ఆ ప్రాంతంలోకి అనుమతించనున్నారు.
నేటి నుంచి పది మూల్యాంకనం
ఏర్పాట్లు సిద్ధం చేసిన విద్యాశాఖ
జిల్లాకు 1,95,674జవాబుపత్రాలు రాక
900 మందిసిబ్బందితో మూల్యాంకనం


