మైదుకూరు : వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలంలోని ఉప్పుగుంటపల్లెలో ఆదివారం పురాతన అమ్మవారి విగ్రహం బయటపడింది. గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి అబ్బిరెడ్డి వారసుల పొలాల వద్ద ఈ విగ్రహంతోపాటు నాగుల విగ్రహాలు వెలుగు చూశాయి. పెద్దిరెడ్డి అబ్బిరెడ్డి కుటుంబీకులు పూజలు నిర్వహిస్తూ పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీసే పుట్ట శనివారం కుంగడాన్ని గమనించారు. ఈ విషయాన్ని దువ్వూరు మండలం జొన్నవరం రామాలయం పూజారికి తెలపగా, తవ్వకాలు జరపకుండా ఆ ప్రాంతాన్ని నీటితో నింపాలని సూచించినట్టు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు పెద్దిరెడ్డి దశరథరామిరెడ్డి తెలిపారు. తాము ఆ విధంగా చేయడంతో మట్టి కరిగి తొలగిపోయి అమ్మవారి విగ్రహం నాగులు విగ్రహాలు బయటపడ్డాయని వివరించారు. ఈ విషయాన్ని మైదుకూరుకు చెందిన ఔత్సాహిక చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్‌కు తెలిపామని ఫొటోలను పంపామని తెలిపారు. ఆయన బయటపడిన విగ్రహం చాముండి విగ్రహం అని, 17వ శతాబ్దానికి చెందినదై ఉండవచ్చని తెలిపారన్నారు. అమ్మవారి విగ్రహం బయటపడిన విషయాన్ని అమెరికాలో ఉంటున్న తమ బంధువులకు తెలియజేశామని దశరథరామిరెడ్డి తెలిపారు.


