ఒంటిమిట్ట: ఏకశిలానగరి కోదండ రామయ్య సన్నిధిలో ఆదివారం పుష్పయాగాన్ని వేడుకగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత పుష్పయాగం, ఏకాంతసేవ నిర్వహించడం సాంప్రదాయం. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన నయనమనోహరమైన పుష్పాలతో కోదండరాముడిని అర్చించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి పులకించిపోయారు.
పుష్పాభిషేకం..
కోదండ రాముడి సన్నిదిలో పుష్పయాగం సందర్భంగా రంగురంగుల పుష్పాలతో జగదభిరాముడికి పుష్పాభిషేకం చేశారు. ఉదయం సుప్రభాత సేవ జరిగింది. ఆలయశుద్ధి, ఆరాధన చేపట్టారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం భాగ్యం కల్పించారు. సాయంత్రం 6 గంటలకు ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పుష్పప్రదర్శన చేశారు. బెంగులూరు, నాగర్‌కోయిల్, శ్రీరంగం, చైన్నె, తిరుపతి, కడప నగరాల నుంచి 3 టన్నుల 12 రకాల పూలు, 6 పత్రాలు పుష్పాలను తెప్పించారు. గులాబి, చామంతి, నూరువరహాలు, సంపంగి, మల్లె, గన్నేరు, మొగలిరేకులు, కనకాంబరాలు, తామర పూలు తీసుకొచ్చారు. తులసిదళాలు, దవనం, పన్నీరు, మరవంపత్రాలతో సీతారామలక్ష్మణ మూర్తులకు పుష్ప నీరాజనం చేశారు. ఈ యాగం నిర్వహించడంతో సమస్త దోషాలు తొలగిపోతాయని వేదపండితులు రాజేష్ భట్టార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉద్యాన అధికారి శ్రీనివాసులు, ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీ కోదండ రామాలయంలో
నయనానందకరంగా పుష్పయాగం


