●తోటలలో మాగిపోతున్న అరటి గెలలు | - | Sakshi
Sakshi News home page

●తోటలలో మాగిపోతున్న అరటి గెలలు

Apr 7 2026 7:43 AM | Updated on Apr 7 2026 7:43 AM

●తోటలలో మాగిపోతున్న అరటి గెలలు

వేముల : పాతాళానికి పడిపోయిన అరటి ధర... రైతన్న లాభాల కలల్ని తుంచేసింది. ఓ సారి ప్రకృతి వైపరీత్యం నిలువునా దెబ్బతీస్తే... మరోసారి ధరాఘాతం అరటి రైతుకు శాపమైంది. పంట బాగొచ్చినా ధర లేక శ్రీగెలశ్రీగిల్లాడుతున్న దుస్థితి నెలకొంది. ఈ ఏడాది అరటి సాగు లాభదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో రైతులు విస్తారంగా పంట సాగు చేశారు. జిల్లాలో వేల ఎకరాలలో అరటి గెలలు కోతకు వచ్చాయి. ఒక్కసారిగా మార్కెట్‌ ధరలు పతనం కావడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. అరటి సాగులో ఎకరానికి లక్ష రూపాయల మేర పెట్టుబడులు పెట్టారు. తోటలలో అరటి గెలలు మాగిపోవడంతో ఎకరాకు 10 టన్నులకు మించి దిగుబడులు లేవని రైతులు అంటున్నారు. సాగులో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రూ.30వేల నుంచి రూ.40వేలు ఆదాయం వస్తే ఎకరాకు రూ.60వేల మేర నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు.

జిల్లాలో 15వేల ఎకరాలలో అరటి తోటలు

జిల్లాలో 40వేల ఎకరాలలో మొదటి, రెండవ, మూడవ అరటి పపంటలు సాగులో ఉన్నాయి. ఇందులో 30వేల ఎకరాలలో ఒక పులివెందుల నియోజకవర్గంలో సాగులో ఉంది. ఇప్పటికే రెండు, మూడు పంటలు అరటి కోతలు పూర్తయ్యాయి. ప్రస్తుతం మొదటి పంట జిల్లాలో 15వేల ఎకరాల్లో సాగులో ఉంది. మొదటి పంటలో అరటి గెలలు కోతకు వచ్చాయి. జూన్‌, జులై మాసాలలో సాగు చేసిన అరటి పంటలో గెలలు కోతకు వస్తున్నాయి. గెలలు కోతకు వచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు.

అరటికి ధరాఘాతం

అరటికి మార్కెట్‌లో ధరలు పూర్తిగా పడిపోయాయి. టన్ను అరటి రూ.3వేల నుంచి రూ.4వేలకు మించి ధరలు లేకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వరకు టన్ను అరటి రూ.22వేలకుపైనే ధరలు ఉండేవి. ధరలు స్థిరంగా ఉంటాయని సాగులో ఆదాయం ఉంటుందని ఆశించిన రైతులకు నిరాశే మిగులుతోంది. రెండవ, మూడవ పంటలలో అరటి గెలలు కోతకు వచ్చిన సమయంలో ధరలు ఉండటంతో ఆదాయం వచ్చింది. మొదటి పంట రైతులకు ధరల్లేక తీవ్రంగా నష్టపోతున్నారు.

శాసిస్తున్న దళారీ వ్యవస్థ

మరోవైపు అరటి ధరలపై దళారుల ప్రభావం తీవ్రంగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే మార్కెట్‌లో అరటి ధరలను దళారీ వ్యవస్థ శాసిస్తోందని చెప్పవచ్చు. అరటి కొనుగోళ్లకు ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చినా దళారులు లేనిదే కొనుగోలు చేయరు. దళారులేమో వ్యాపారులు ఇచ్చే డబ్బులకు ఆశపడి సిండికేట్‌గా ఏర్పడి అరటి ధరలను నిర్ణయిస్తూ రైతులను దోచుకుంటున్నారు. వ్యాపారులు తోటలను చూసి దళారీ ఎంత ధరకు చెబితే అంతే ధరలకు రైతులు అమ్ముకోవాల్సి వస్తోంది.

కొనుగోళ్లకు ముందుకురానీ వ్యాపారులు

అరటి ధరలు మార్కెట్‌లో పడిపోవడంతో అరటి కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకు రావడంలేదు. మార్కెట్‌ ధరలు ఉంటే స్థానిక వ్యాపారులు నేరుగా తోటల వద్దకు వచ్చి రైతులతో మాట్లాడి అరటి కొనుగోలు చేసేవారు. ధరలు పతనం కావడంతో స్థానికంగా ఉన్న వ్యాపారులు తోటలవైపు చూడటంలేదు. ధరలు ఉన్నప్పుడు తోటల వద్దకు వచ్చిన వ్యాపారులు ధరలు పడిపోగానే అటువైపు కన్నెత్తి చూడలేదని రైతులు వాపోతున్నారు.

అరటి పంట కాలం పూర్తయినా ధరలు లేక గెలలు కోత కోయలేదు. దీంతో తోటలలో అరటి గెలలు మాగిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. అరటి గెలలు మాగితే ఆ గెలలను వ్యాపారులు కొనుగోలు చేయరని, మాగిపోవడంవలన ఆ గెలలను వదిలివేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు మాగిన అరటి గెలలను కోసి ట్రాక్టర్లతో బయటకు తరలించి పారేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement