కడపసెవెన్‌రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో, అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌తోపాటు జేసీ నిధి మీనా, డీఆర్‌ఓ మల్లికార్జున వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో రీ ఓపెన్ అయిన అర్జీలను మరింత నాణ్యతతో పరిష్కరించాలని, జిల్లా అధికారులకు అందిన అర్జీలను పరిష్కరించేందుకు సమయం కేటాయించాలన్నారు.
సాగునీటి సంఘాల బాధ్యత కీలకం
జలమే సంపద, జలమే జీవనాధారం.. అన్న సత్యాన్ని గుర్తెరిగి నీటి భద్రతా బాధ్యతలో.. సాగునీటి సంఘాలు కీలక పాత్ర పోషించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ‘జలధార.. నీటి భద్రత–సాగు నీటి సంఘాల బాధ్యత’అమలు ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుండి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంబందిత అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో నీటి భద్రత అందరి బాధ్యతగా భావించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ‘జలధార’కార్యక్రమంలో భాగంగా.. ఏప్రిల్ 6 నుంచి జూలై 14వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో జల ధార కార్యక్రమానికి సంబంధించి 100 రోజుల ప్రణాళికను బాధ్యతగా అమలు చేయాలన్నారు.
‘జలధార’విజయవంతంగా నిర్వహిద్దాం
ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టేందుకు ప్రారంభించిన ‘జలధార’కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మండల స్థాయి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


