తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

Feb 25 2026 9:34 AM | Updated on Feb 25 2026 9:34 AM

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

కడప సెవెన్‌రోడ్స్‌: వేసవిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా నివారణ చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్మన్‌ ముత్యాల రామగోవిందరెడ్డి అధికారులను ఆదేశించారు. కడపలోని జిల్లా పరిషత్‌లో మంగళవారం నిర్వహించిన స్థాయీ సంఘాల సమావేశంలో వివిధ అంశాలను ఆయన సమీక్షించారు. చక్రాయపేట మండలంలోని సురభి, కల్లూరిపల్లె తదితర గ్రామాలతో పాటు వీఎన్‌ పల్లె, చాపాడు మండలాల్లో తాగునీటి సమస్య ఉన్నట్లు ఆర్‌డబ్ల్యుఎస్‌ పర్యవేక్షక ఇంజినీరు ఏడుకొండలు చైర్మన్‌ దృష్టికి తీసుకువచ్చారు. మరో ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారి మాట్లాడుతూ రాజంపేట మండలం ఊటుకూరులోని సీపీడబ్ల్యుఎస్‌ స్కీమ్‌ రూ.10 కోట్ల అంచనా వ్యయంతో నాబార్డు రుణంతో చేపట్టామన్నారు. చెయ్యేరు నుంచి 12 గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే ఈ పథకం గ్రాంట్స్‌ లేక అర్ధంతరంగా పనులు ఆగిపోయాయన్నారు. పనులన్నీ పూర్తి చేసేందుకు రూ.కోటి 50 లక్షలు అవసరం అవుతాయని తెలిపారు. అయితే, తాత్కాలికంగా వినియోగంలోకి తీసుకువచ్చేందుకు రూ.25 లక్షలు అవసరమని తెలిపారు. దీనిపై జెడ్పీ చైర్మన్‌ స్పందిస్తూ జెడ్పీ జనరల్‌ ఫండ్‌ నుంచి రూ. 25 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రెగ్యులర్‌ ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈని నియమించాలని ఒంటిమిట్ట జెడ్పీటీసీ కోరారు. జెడ్పీచైర్మన్‌ మాట్లాడుతూ జిల్లాలో బోర్లలో నీరు తగ్గిపోతే డీపెనింగ్‌ చేయాలన్నారు. అవసరమైన చోట్ల మాత్రం కొత్త బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కడప నగరంలోని లక్ష్మిరంగ హాలు సమీపంలోని జెడ్పీ స్థలంలో చేపట్టిన భవన నిర్మాణాలకు జనరల్‌ ఫండ్‌ నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చైర్మన్‌ తెలిపారు. పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్‌, వేముల జెడ్పీటీసీ బయపురెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్లు నిండిన వారందరికీ పెన్షన్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం ఏమైందని ప్రశ్నించారు. కొత్త పెన్షన్ల మాటేమిటని నిలదీశారు. ఇందుకు డీఆర్‌డీఏ అధికారి బదులిస్తూ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎస్‌ఓపీ రావాల్సి ఉందన్నారు. స్పౌజ్‌ పెన్షన్లు పెండింగ్‌ ఏవైనా ఉంటే వెంటనే పరిష్కరిస్తామన్నారు. హౌసింగ్‌ పనులకు సంబంధించిన బిల్లులు రావాల్సి ఉందని పీడీ ఒక ప్రశ్నకు బదులిచ్చారు. పెద్దముడియం జెడ్పీ హైస్కూలు భవన నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయని, నిధులు కేటాయించాలని జెడ్పీటీసీ హిమజ కోరారు. దీనిపై చైర్మన్‌ స్పందిస్తూ రూ.20 లక్షలు జెడ్పీ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఉపాధ్యక్షుడు బాలయ్య, వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి, ఇతర జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.

రాజంపేట సీపీడబ్ల్యు స్కీమ్‌కురూ.25 లక్షలు

పెద్దముడియం హైస్కూలుకురూ.20 లక్షలు

జెడ్పీ చైర్మన్‌ ముత్యాల రామగోవిందరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement