
కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో అర్బన్ ఆటో మ్యూటేషన్ ప్
కడప కార్పొరేషన్ : కడప నగరపాలక సంస్థలో ఆగస్టు 1వ తేదీ నుంచి నూతన ‘అర్బన్ ఆటో మ్యూటేషన్ ప్రక్రియ’ అమలు కానుంది. పట్టణ ప్రాంతాల్లో ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మ్యూటేషన్ చేయించుకోవడంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, ఆిస్తి యాజమాన్య బదిలీ ప్రక్రియ సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్‌టీఆర్ జిల్లా విజయవాడలోని 4 సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించి సత్ఫలితాలు సాధించిన మీదట కడప మున్సిపల్ కార్పొరేషన్‌తో సహా మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 17 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ నూతన విధానం అమలు చేయనున్నారు. దీనివల్ల దాన, విక్రయ, పరివర్తన దస్తావేజుల రిజిస్ట్రేషన్ ద్వారా ఆస్తి పూర్తి స్థాయిలో బదలాయింపు అయిన తక్షణం కొనుగోలుదారు పేరిట మ్యూటేషన్ జరిగిపోతుంది. కొత్త అర్బన్ మ్యూటేషన్ ప్రక్రియను ఐజీఆర్‌ఎస్, (సీడీఎంఏ) ఏపీఐతో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా సరళీకృతం చేయడం వల్ల ప్రక్రియ ఆస్తి పన్ను, యాజమాన్య వివరాలను ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్(పీటీఐఎన్) ఉపయోగించి సీడీఎంఏ సిస్టమ్‌లో ఇంటిగ్రేట్ చేస్తుంది. సాధారణంగా పురపాలక సంఘాల్లో నిర్వహించే మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి 15–30 రోజులు పడుతుంది. సీడీఎంఏ డేటాబేస్ నుంచి పీటీఐఎన్ ఉపయోగించి ఆస్తి వివరాలను నేరుగా పొందడం ద్వారా మాన్యువల్ విధానం తగ్గుముఖం పట్టే అవకాశముంది. అతి తక్కువ సమయంలోనే బదిలీ అయిన ఆస్తికి పన్ను చెల్లింపు, భవన అనుమతులు, యుటిలిటీ సేవలు పొందడానికి వీలు కలుగుతుంది. ఆటో మ్యూటేషన్ ఫీజు విషయానికి వస్తే ఆస్తి విలువను బట్టి ఆన్‌లైన్ ద్వారా లెక్కిస్తారు. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. ఇతర ఖర్చులు కూడా ఉండవు. (సీడీఎంఏ) ఏపీఐ ఇంటిగ్రేషన్ ద్వారా ఆస్తి వివరాలు, పన్ను బకాయిలు, యాజమాన్య రికార్డులు కచ్చితమైనవిగా ఉంటాయి. మనం పొరపాటున తప్పు డోర్ నంబర్ నమోదు చేసినా సిస్టమ్ తక్షణమే లోపాలను గుర్తిస్తుంది. ఈ విధానానికి ఫోన్ నంబర్‌ను కూడా లింక్ చేయడం వల్ల ఎస్‌ఎంఎస్ నోటిఫికేషన్లు, ఆన్‌లైన్ స్టేటస్ ట్రాకింగ్ వంటి సదుపాయాల ద్వారా దరఖాస్తుదారులు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవచ్చు.
ఆగస్టు నుంచి అమలుకు రంగం సిద్ధం
ఆస్తి సంబంధిత వివాదాలను తగ్గిస్తుంది
నూతన ‘అర్బన్ ఆటో మ్యూటేషన్ ప్రక్రియ’ ద్వారా ఆస్తి సంబంధిత వివాదాలు తగ్గుతాయి. యాజమాన్య హక్కు, బదిలీలను ఆటోమేట్ చేయడం, పన్ను చెల్లింపులను ఇంటిగ్రేట్ చేసి, ఆన్‌లైన్ సౌలభ్యాన్ని అందిస్తుంది. ఆలస్యం, లోపాలు, పారదర్శకత లోపాలను పరిష్కరిస్తుంది. ఈ ప్రక్రియ పట్టణ ఆస్తి యజమానులు రికార్డులను సమర్థవంతంగా ఆధునీకరించడానికి చట్టపరమైన యాజమాన్యాన్ని సురక్షితం చేయడానికి, సంబంధిత ప్రయోజనాలను పొందడానికి వీలు కల్పిస్తుంది.
– మనోజ్‌రెడ్డి, కమిషనర్, నగరపాలక సంస్థ.