సింహాద్రిపురం : స్మార్ట్ మీటర్లు బిగిస్తే ప్రజా ఉద్యమం తప్పదని వాటిని ఎక్కడ బిగించినా పగులగొడతామని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అన్నారు. బుధవారం ఆయన అంకాలమ్మ గూడూరులో జరిగిన సీపీఐ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణలు తానే తెచ్చానని చంకలు గుద్దుకోవడం కాదని ఆ సంస్కరణలు ప్రజలపైన పెను భారాలు మోపుతున్నాయని చెప్పారు.
గతంలో విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ చార్జీలు పెంచడంతో ప్రజా తిరుగుబాటుతో ప్రభుత్వం కూలిపోయిందని గుర్తు చేశారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఆగస్టు 5న జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఏరియా కార్యదర్శి వెంకటరాములు, సహాయ కార్యదర్శి కాల్వ బ్రహ్మం, జిల్లా సమితి సభ్యులు ఈశ్వరయ్య, అమీర్, అనిల్, వినయ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
బైక్‌లు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
బ్రహ్మంగారిమఠం : మండల పరిధిలోని గంగిరెడ్డిపల్లె–తోట్లపల్లె గ్రామాల మధ్యలోని రహదారిలో బుధవారం రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని భగత్‌సింగ్ కాలనీకి చెందిన సుబ్బయ్య కుమారుడు సూరి, ఎంపీడీఓ కార్యాలయంలో పని చేస్తున్న ప్రసాద్ కుమారుడు సన్ని లు వేర్వేరు బైక్‌లలో వస్తుండగా ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇరువురిని 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివప్రసాద్ తెలిపారు.

విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగులగొడతాం