
మా భూములు మాకే ఇవ్వాలి
బద్వేలు అర్బన్ : గత కొన్నేళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములు తమకే ఇవ్వాలని మున్సిపాలిటీ పరిధిలోని మడకలవారిపల్లెకు చెందిన దళితులు బుధవారం మడకలవారిపల్లె సమీపంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారి (ఎన్‌హెచ్–67)పై ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులకు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది. వివరాల్లోకి వెళితే.. గోపవరం రెవెన్యూ పొలం 1755 సర్వే నెంబరులో ఉన్న జెడ్‌హెచ్‌డీసీ భూములను ఏక్‌సాల్ పర్మిషన్ కింద గత 40 సంవత్సరాలుగా మడకలవారిపల్లెకు చెందిన దళితులు సాగు చేసుకుంటున్నారు. అదే సర్వే నెంబరులో 30 ఎకరాలు కడప అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఐజీ లేఅవుట్‌కు కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి కూడా లభించింది. సదరు భూమిని చదును చేసేందుకు సంబంధిత కాంట్రాక్టర్ బుధవారం చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న మడకలవారిపల్లె దళితులు పనులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేయగా పోలీసుల సహకారంతో వారిని పంపించివేశారు. అక్కడి నుండి వెనుదిరిగిన దళితులు మడకలవారిపల్లె సమీపంలో జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ సమయంలో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అలాగే గ్రామానికి చెందిన ఓ దళితుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న రూరల్ పోలీసులు ఏదైనా సమస్య ఉంటే ఆర్డీఓ కార్యాలయానికి గాని తహసీల్దారు కార్యాలయానికి గాని వెళ్లి విన్నవించుకోవాలని, ఇలా రోడ్లపై వాహనాలను నిలపడం సరికాదని ఆందోళనకారులకు సర్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
జాతీయ రహదారిపై దళితుల ఆందోళన
పోలీసుల జోక్యంతో
సద్దుమణిగిన వివాదం