
ప్రయాణికులకు ‘తిరుమల’ కష్టాలు!
హెలీప్యాడ్ కోసం స్థల పరిశీలన
జమ్మలమడుగు : జమ్మలమడుగులో ఆగస్టు 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇన్‌చార్జ్ భూపేష్‌రెడ్డి సోమవారం హెలిప్యాడ్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. ముద్దనూరు రోడ్డులో ఉన్న పాలిటెక్నికల్‌కాలేజి ప్రాంతంలోని స్థలాన్ని పరిశీలించారు. ఆర్డీఓ సాయిశ్రీ, తహసీల్దార్ శ్రీనివాసులరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ నాగేశ్వరరెడ్డి ,గొనా పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు.
కడప కోటిరెడ్డిసర్కిల్ : సాధారణంగా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా రైలులో ప్రయాణించడానికి ఒక టిక్కెట్ కొనుగోలు చేస్తే సరిపోతుంది. ‘తిరుమల ఎక్స్‌ప్రెస్’లో ప్రయాణించాలంటే రెండు టికెట్లు కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆశ్చర్యపోవద్దు.. ఇది నిజం. రైల్వేశాఖ తీసుకున్న వింత నిర్ణయం.
ప్రతిరోజు కడప–విశాఖపట్టణం–కడప మధ్య తిరుగుతున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలును గతనెల 2వ తేదినుంచి గుంతకల్లు వరకు పొడిగించారు. అంత వరకు బాగానే ఉన్నా ఈ రైలును కడప నుంచి గుంతకల్లు వరకు స్పెషల్ ప్యాసింజర్ రైలుగా నడపడం ప్రయాణికులను కష్టాలు తెచ్చి పెడుతోంది. విశాఖపట్టణం నుంచి కడపకు వచ్చిన తర్వాత ఎర్రగుంట్ల, కొండాపురం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు ప్రాంతాలకు వెళ్లాలంటే కడపలో మరో టిక్కెట్ తీసుకోవాల్సి వస్తోంది. అలాగే గుంతకల్లు నుంచి ఈ రైలులో గుంతకల్లు నుంచి కడప మీదుగా వెళ్లాల్సిన ప్రయాణికులు కడపలో దిగి మరో టిక్కెట్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గమ్యాన్ని చేరుకునేందుకు ఒక రైలులోనే ఇలా రెండు టిక్కెట్లు కొనాల్సి వస్తోంది.
మహిళలు, వృద్ధులు, లగేజీతో వెళుతున్న వారి ఇబ్బందులు వర్ణణాతీతం
గుంతకల్లు నుంచి తిరుపతి, విజయవాడ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రైలులో గుంతకల్లు–కడప మధ్య జనరల్ టిక్కెట్ తీసుకుని, ఆ తర్వాత కడప నుంచి తాము వెళ్లే ప్రాంతం వరకు ఎక్స్‌ప్రెస్ టిక్కెట్‌ను కొనుగోలు చేయా ల్సి వస్తోంది. ఈ క్రమంలో టిక్కెట్ల కోసం కడప రైల్వేస్టేషన్‌లో దిగి మరో టిక్కెట్ కొనాల్సి వస్తోంది. రైల్వే అధికారుల నిర్ణయంతో మహిళలు, వృద్ధులు, లగేజీతో వెళుతున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేశాఖ నిర్ణయంతో పలుమార్లు ప్రయాణికులు ఘర్షణ పడిన సంఘటనలూ లేకపోలేదు. నేరుగా ఒకే టిక్కెట్టుపై ప్రయాణించే సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ప్రయాణికుల రద్దీ మేరకు నిర్ణయం
ప్రస్తుతం కడప–గుంతకల్లు మధ్య స్పెషల్ ప్యాసింజర్‌గా తిరుగుతున్న రైలును ప్రయాణికుల రద్దీ పరిశీలన నిమిత్తం తిప్పుతున్నారు. ప్రయాణికుల ఆదరణ పెరిగితే భవిష్యత్తులో తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను గుంతకల్లు వరకు పొడిగిస్తారు. ప్రస్తుతానికి అన్ రిజర్వుడు ప్యాసింజర్‌గా నడుపుతున్న రైలులో కొద్దిరోజులపాటు ప్రయాణికులు ఇబ్బందులు తప్పవు. – జనార్దన్,
రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్, కడప
రైలు ఒకటే... టికెట్లు రెండు కొనాలి
విశాఖ నుంచి కడప వరకు
ఎక్స్‌ప్రెస్‌గా.. కడప నుంచి
గుంతకల్లు వరకు ప్రత్యేక
ప్యాసింజర్‌గా రాకపోకలు

ప్రయాణికులకు ‘తిరుమల’ కష్టాలు!