
జెడ్పీ డిప్యూటీ సీఈఓ
అక్షరాస్యతలో
భాగస్వాములు కావాలి
కడప సెవెన్‌రోడ్స్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఉల్లాస్ అక్షరాంధ్ర’కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు భాగస్వాములు కావాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సి.సుబ్రమణ్యం అన్నారు. వయోజన విద్య ఉప సంచాలకులు ఎంవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన మంగళవారం జెడ్పీ ఆవరణలోని డీపీఆర్‌సీ భవనంలో అధికారులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో 3,33,500 మంది వయోజనులైన నిరక్షరాస్యులు ఉన్నట్లు 2023లో జీఎస్‌డబ్ల్యూఎస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైందని పేర్కొన్నారు. మొదటి దశలో 1,01,465 మంది అక్షరాస్యులుగా మార్చేందుకు కార్యచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. రానున్న మూడేళ్లలో అక్షరాస్యతలో జిల్లాను మొదటిస్థానంలోకి తీసుకురావాలని కోరారు. వయోజన విద్య ఉప సంచాలకులు ఎంవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 7 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేది వరకు వంద గంటలపాటు తరగతులు నిర్వహిస్తామన్నారు. నిరక్షరాస్యులకు ఫైనాన్షియల్ లిటరసీ, డిజిటల్ లిటరసీ, ఫంక్షనల్ లిటరసీలలో శిక్షణ ఇస్తామన్నారు. మార్చిలో వారికి పరీ క్షలు నిర్వహిస్తామని వివరించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ రాజ్యలక్ష్మి, ఏపీడీ ప్రసాద్, మెప్మా పీడీ కిరణ్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఏపీఎంలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు.