
మానవతావాదులకు పీ–4 గొప్ప అవకాశం
కడప సెవెన్‌రోడ్స్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీ–4 ఫౌండేషన్ కార్యక్రమం విధానం మానవతను చాటుకునే మార్గదర్శులకు గొప్ప అవకాశం అని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో పీ–4 కార్యక్రమానికి సంబంధించి జిల్లాలోని మార్గదర్శకులతో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి.. జేసీ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు లతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మార్గదర్శులతో కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పీ4 ఫౌండేషన్ ద్వారా.. ప్రతి బంగారు కుటుంబం కూడా భవిష్యత్ మార్గదర్శిగా ఎదగగలదని ఆకాంక్షించారు. పీ–4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్ షిప్) కార్యక్రమం ద్వారా జిల్లాలో మార్గదర్శులకు పీ4 కార్యక్రమంపై అవగాహన కల్పించారు. తలా పిడికెడు బియ్యం పోగుచేసి.. ఒక కుటుంబం ఆకలి తీర్చే పురాతన పద్ధతిని ఆధారంగా చేసుకుని, పేదరిక నిర్మూలనలో మహిళా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యం స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పీ4 ఫౌండేషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రతి గ్రామంలోని అన్ని కుటుంబాలను 360ని కోణంలో వారి అవసరాలను పరిశీలించి... ఒక యాప్ ద్వారా ఆయా కుటుంబాల అవసరాలను సూచించడం జరిగిందన్నా రు. మార్గదర్శులుగా మీకు నచ్చిన, చేయదగిన సాయాన్ని, అవసరాన్ని కోరే కుటుంబాలకు సహా యం అందించవచ్చన్నారు. అర్హులైన పేద కుటుంబాలను గుర్తించడంతో పాటు వారిని దత్తత తీసుకునేందుకు మార్గదర్శులు సహృద్భవంతో ముందుకు సాగాలన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రవాసాంధ్రులను కూడా భాగస్వామం చేసుకొని బంగారు కుటుంబాల దత్తత ఎంపిక నమోదు క్షేత్ర స్థాయిలో వేగవంతంగా పూర్తి చేసి తప్పక ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఎంపీడీవోలు, తహసీల్దారులు, మున్సిపల్ కమిషనర్లతో పలు పీ4 బంగారు కుటుంబాలను గుర్తించి వారి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పీ4 బంగారు కుటుంబాల కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మార్గదర్శుల నుంచి వారు చేస్తున్న సేవలు, వారి అభిప్రాయాలు, సలహాలను స్వీకరించారు. కార్యక్రమంలో కేఎంసీ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప, బద్వేలు ఆర్డీవోలు జాన్ ఇర్విన్, చంద్ర మోహన్, సిపిఓ హజరతయ్య, జెడ్పి సీఈవో ఓబులమ్మ, డ్వామా పీడి అదిశేషారెడ్డి, ఇండస్ట్రీస్ జీఎం చాంద్ బాషా, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మార్గదర్శుల సమావేశంలోకలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
పేదరిక నిర్మూలనకు మార్గదర్శులవ్వండి