
అక్కాచెల్లెళ్లు సజీవ దహనం
రాయచోటి: పేద కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు సజీవ దహనమైన సంఘటన రాయచోటిలో మంగళవారం సాయంత్రం సంచలనంగా మారింది. పట్టణంలోని పూజారి బండ వీధిలో చోటు చేసుకున్న సంఘటనలో.. అక్క షేక్ బీబీ ఫాతిమ (27), షేక్ ఆఫ్రిన్ (25) మంటల్లో కాలిపోయి మృత్యువాత పడ్డారు. అయితే కారణాలు అంతుకు చిక్కడం లేదు. వివరాలిలా ఉన్నాయి. పూజారి బండకు చెందిన షేక్ హుస్సేన్, మాబ్ జాన్‌లకు షేక్ బీబీ ఫాతిమా, షేక్ ఆఫ్రిన్‌లు సంతానం. వీరిద్దరూ ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నారు. తరువాత ఇంటి వద్దనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. హుస్సేన్ భార్య మాబ్‌జాన్‌తో కలిసి ఇంటి సరుకుల కోసం మంగళవారం సాయంత్రం బజారుకు వెళ్లిన సమయంలో.. ఇంటిలో బాలికలు ఇద్దరే ఉన్నారు. ఆ సమయంలోనే గడియ పెట్టుకొని అక్కాచెల్లెళ్లు శరీరాలపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకున్నట్లు స్థానికుల సమాచారం. మంటల్లో కాలుతుండగా చుట్టపక్కల వారు గమనించి.. తలుపులు పగులకొట్టి వారిద్దరినీ ఆసుపత్రికి చేర్చారు. అప్పటికే శరీరమంతా తీవ్రంగా కాలిపోయిన ఫాతిమా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆఫ్రీన్ తీవ్ర గాయాలతో విషమ పరిస్థితిలో ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నా పరిస్థితి విషమించడంతో మృతి చెందింది.
ఇంటిలో ఎవరూ లేని సమయంలో..
అక్కాచెల్లెళ్లు ఒకేసారి మంటల్లో కాలిపోయిన సంఘటన రాయచోటి పట్టణంలో సంచలనంగా మారింది. ఈ సంఘటనపై స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మంటల్లో కాలి ఇద్దరు మృతి
అంతుచిక్కని కారణాలు

అక్కాచెల్లెళ్లు సజీవ దహనం