
టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి టాస్క్‌ఫోర్స్ : టీడీపీ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. అధికారమే అండగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని చిన్నకేశంపల్లె గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతలు తమ పొలంలోకి వెళ్లేందుకు ఓ దళితుడికి చెందిన పట్టా భూమిలో, వంక పోరంబోకులో రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇదేమిటని ప్రశ్నించిన పట్టాదారుడిపై దౌర్జన్యం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సమీపంలోని చెరువు నుండి గ్రావెల్ తవ్వుకుని వంక పోరంబోకులో రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
మున్సిపాలిటీ పరిధిలోని చిన్నకేశంపల్లె గ్రామంలో సర్వే నంబర్ 1255, 1256, 1270, 1272, 1273 లలో సుమారు 30 మీటర్ల వెడల్పు మేర సగిలేరు వరకు వంక పోరంబోకు స్థలం ఉంది. సదరు స్థలం సమీపంలో గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతలకు వ్యవసాయ భూములు ఉన్నాయి. సదరు భూములలోకి నేరుగా రోడ్డు వేయించుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలు బరితెగించారు. అధికారుల అండదండలతో సమీపంలోని చెరువు నుంచి గ్రావెల్ తవ్వుకుని వంక పోరంబోకులో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో చెన్నంపల్లె గ్రామానికి చెందిన శీలిపెద్దచెన్నయ్య పేరుతో 1249/2, 1248/5, 1252/2, 1251/3 సర్వేనెంబర్లలో ఉన్న పట్టా భూమిలో సైతం రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ విషయమై శీలిపెద్దచెన్నయ్య కుమారుడు శీలి చెన్నయ్య నా పట్టాభూమిలో రోడ్డు ఎలా వేస్తారని ప్రశ్నించినప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా రోడ్డు పనులు కొనసాగించారు.
పట్టించుకోని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు
వంక పోరంబోకు, చెరువు పోరంబోకు స్థలాల్లో ఎవరైనా పనులు చేపట్టినా మట్టిని తవ్వినా ఆగమేఘాల మీద చర్యలకు ఉపక్రమించే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చిన్నకేశంపల్లె గ్రామంలో యథేచ్ఛగా చెరువులో మట్టిని తవ్వుకుని వంక పోరంబోకు స్థలంలో రోడ్డు నిర్మాణం చేపడుతున్నా ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. అంతేకాకుండా చెన్నంపల్లె చెరువు నుంచి చిన్నకేశంపల్లె, పెద్దకేశంపల్లె మీదుగా సగిలేరు వరకు ఉన్న వంక పోరంబోకు స్థలాన్ని సర్వే చేయకుండా కేవలం కొద్ది మంది వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల స్థలాల వద్ద మాత్రమే సర్వే చేసి హద్దులు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. ఇదే విషయమై గ్రామానికి చెందిన పలువురు రైతులు జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశారు.
ఈ విషయమై ఇరిగేషన్ డీఈ వేణుగోపాల్‌రెడ్డిని వివరణ కోరగా ఇటీవల చిన్నకేశంపల్లె గ్రామంలో సర్వే చేసి ప్రభుత్వ స్థలాన్ని, వంక పోరంబోకు స్థలాన్ని గుర్తించి హద్దులు ఏర్పాటు చేశామన్నారు. గ్రామానికి చెందిన కొందరు తమ పొలాలకు వెళ్లేందుకు రహదారి కావాలని కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపామని... ఇంతలోనే రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే పనులు నిలుపుదల చేస్తామన్నారు.
పట్టా భూమి, వంక పోరంబోకులో యథేచ్ఛగా రోడ్డు నిర్మాణం
ప్రశ్నించిన పట్టాదారుడిపై దౌర్జన్యం
దౌర్జన్యానికి పాల్పడుతున్నారు
నా తండ్రి పేరు మీద చిన్నకేశంపల్లె గ్రామంలో ఉన్న 98 సెంట్ల పట్టా భూమిని 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నా. ఇటీవల గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతలు తమ పొలాలకు వెళ్లేందుకు మా పట్టా భూమిలో రోడ్డు నిర్మిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. గతంలో కూడా టీడీపీ నేతలు చెన్నంపల్లెలో మాకు జీవనాధారంగా ఉన్న దుకాణాన్ని తొలగించారు.
– ఎస్.చెన్నయ్య, చెన్నంపల్లె

టీడీపీ నేతల దౌర్జన్యం