కాశినాయన క్షేత్రానికి శాశ్వత పరిష్కారం చూపండి
పోరుమామిళ్ల : జ్యోతి క్షేత్రంలోని కాశినాయన ఆలయానికి శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్సీ డీసీ.గోవిందరెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన కలిసి సమస్య విన్నవించారు. ఇటీవల జ్యోతి క్షేత్రంలో భవనాలను అటవీ అధికారులు కూల్చి వేశారని, ఆలయ నిర్మాణం అర్థాంతరంగా నిలిచిపోయిందని విన్నవించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తులు, ప్రయత్నాలకు కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. కాశినాయనకు కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో లక్షలాది కాశినాయక భక్తులున్నారని, కూల్చివేతలపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానన్నారు.


