రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : నందలూరు– మంటపంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం ఉదయం ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. రైల్వే పోలీసుల సమాచారం మేరకు.. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం శంకరంబాడి గ్రామానికి చెందిన శ్రీనివాసులు(34) తిరుమల దర్శనం ముగించుకుని కేప్ పూణే ఎక్స్‌ప్రెస్ రైలులో స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో రైలు నుంచి జారి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి ముఠా సభ్యుల అరెస్టు
గుర్రంకొండ : గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఐదుకేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొన్న సంఘటన మండల కేంద్రమైన గుర్రంకొండలో జరిగింది. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ కథనం మేరకు గుర్రంకొండ పట్టణ పరిసరాల్లో గంజాయి విక్రయాలు జోరుగా జరుగుతున్నాయనే సమాచారం అందుకొన్న వాల్మీకిపురం సీఐ రాఘవరెడ్డి, గుర్రంకొండ ఎస్‌ఐ రవీంద్రబాబుల ఆధ్వర్యంలోని రెండు వేర్వేరు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఆదివారం గ్రామానికి సమీపంలో గంజాయి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ముఠా సభ్యులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మండలంలోని ఎల్లుట్ల పంచాయతీ పసలవాండ్లపల్లెకు చెందిన కనగాని వెంకటరమణ (40), స్థానిక ఇందిరమ్మ కాలనీకి చెందిన గుటం సమీర్ (20), గుర్రంకొండ పట్టణం ఎస్‌ఎల్‌టీ వీధికి చెందిన షేక్ మహమ్మద్ సైఫ్ (19), తరిగొండ పంచాయతీ ఇరగన్నగారిపల్లెకు చెందిన అరుణ్‌కుమార్ (19)లతో పాటు ఓ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. వారి వద్ద నుంచి ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ముఠా సభ్యులపై కేసు నమోదు చేశామన్నారు. స్వాధీనం చేసుకొన్న గంజాయి విలువ రూ. లక్ష వరకు ఉంటుందన్నారు. గంజాయి ముఠా సభ్యుల్ని అదుపులోకి తీసుకోవడంలో మంచి ప్రతిభ కనబరిచిన వాల్మికిపురం సీఐ రాఘవరెడ్డి, ఎస్‌ఐ రవీంద్ర, హెడ్‌కానిస్టేబుల్ నాగరాజనాయక్‌లను ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించినట్లు ఆయన పేర్కొన్నారు.
ముగ్గురు మండీ
యజమానులకు నోటీసులు
గుర్రంకొండ : ప్రభుత్వ నిబంధనలను పాటించని ముగ్గురు టమాటా మండీల యజమానులకు నోటీసులు జారీచేశామని వాల్మీకిపురం మార్కెట్ కమిటీ చైర్మన్ కోసూరి చంద్రమౌళి, వైస్ చైర్మన్ నౌషాద్ అలీ తెలిపారు. ఆదివారం స్థానిక మార్కెట్‌యార్డు ఉప కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మార్కెట్ కమిటీ నిబంధనల మేరకు మార్కెట్ యార్డుకు 8 కిలోమీటర్ల పరిధి వరకు ఎవరూ కూడా ప్రైవేట్ టమాటా మండీలను నిర్వహించకూడదన్నారు. అలా నిర్వహించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొంటామన్నారు. మదనపల్లె మార్కెట్‌యార్డులో జాక్‌పాట్‌లను ఫూర్తిగా రద్దు చేశారన్నారు. ఇదే విధానాన్ని ఇక్కడి మండీల యజమానులు పాటించాలన్నారు. కమీషన్లు పదిశాతం బదులు నాలుగు శాతం మాత్రమే తీసుకోవాలన్నారు. వచ్చేనెల నుంచి 25 కేజీల టమాటా క్రీట్ల స్థానంలో 15 కేజీల క్రీట్ల విధానాన్ని అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ ఇన్‌చార్జి కార్యదర్శి సునీల్, సిబ్బంది పాల్గొన్నారు.
తండ్రి కోసం.. కుమారుడి
మృతదేహం ఎదురుచూపు
కురబలకోట : రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆదివారం మృతి చెందిన కుమారుడి మృతదేహం సౌదీలోని తండ్రి రాక కోసం ఎదురు చూస్తున్న విషాదకర సంఘటన కురబలకోటలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు..మండల కేంద్రం కురబలకోటకు చెందిన కె. తన్వీర్ (24) మూడు రోజుల క్రితం మదనపల్లి నుండి బైక్‌లో స్వగ్రామానికి వస్తూ మార్గ మధ్యంలోని గౌనివారిపల్లి వద్ద ప్రమాద వశాత్తు డివైడర్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లి జిల్లా ఆసుపత్రి నుండి మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని పోలీసులు కుటుంబీకులకు అప్పగించారు. జీవనోపాధి కోసం సౌదీలో ఉన్న తండ్రి కె. రెడ్డిబాషా రాక కోసం మృత దేహాన్ని ఇంటి వద్ద ఉంచారు. కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
కురబలకోటలో విషాదం
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి


