చంద్రబాబు పాలనలో బీసీలకు అన్యాయం
కడప కార్పొరేషన్ : చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరామ్ అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబు జమానాలో బీసీల భవిష్యత్తు అంధకారంగా మారిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బీసీలకు ద్రోహం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో బీసీలకు కనీసం ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. 50 సంవత్సరాలు దాటిన బీసీలకు రూ. 4000 పింఛన్ ఇస్తానని ఇవ్వలేదని, బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన హామీని గాలికి వదిలేశారన్నారు. బీసీలకు రక్షణ చట్టం తీసుకువస్తామని చెప్పి రక్షణ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ బీసీ వ్యతిరేక విధానాలపై రాబోయే రోజుల్లో రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు.


