పేదల సొంతింటిపై చిత్తశుద్ధి లేని కూటమి
కడప సెవెన్‌రోడ్స్ : పేదలకు సొంతిల్లు ఉండాలన్న విషయంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అర్హులందరికీ రెండు సెంట్ల స్థలం, టిడ్కో ఇల్లు ఇవ్వాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేయాలన్నారు. పెండింగ్ పనులు తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు. సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకట శివ అధ్యక్షతన జరిగిన నిరాహార దీక్ష కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగసుబ్బారెడ్డి, వేణుగోపాల్, బాదుల్లా, సుబ్రమణ్యం, మునెయ్య, మనోహర్‌రెడ్డి, లింగన్న తదితరులు పాల్గొన్నారు.


