రిమ్స్‌లో తీరు మారదంతే..!
కడప టాస్క్‌ఫోర్స్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)తీరు మారడం లేదు. ఓపీ విభాగంలో మహిళా కంటి విభాగం(ఆప్తాలమిక్)లో గురువారం ఉదయం 10:20 గంటలైనా వైద్యులు రాకపోవడం గమనార్హం. అలాగే ఆప్తాల్మిక్, ఈఎన్‌టీ విభాగాలకు శ్రీరీ వెరిఫికేషన్‌శ్రీకు వచ్చిన రోగులు, వారి సహాయకుల క్యూలైన్ పెద్దదిగా వుండి ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడ రిజిస్టర్‌లలో పేర్లను నమోదు చేసేందుకు విద్యార్థులను.. ఎలాంటి ఉద్యోగి పర్యవేక్షణ లేకుండానే వారికి వదిలేయడం ఎంత వరకు సమంజసం.
● ఓపీ విభాగంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కోతుల బెడద తప్పడం లేదు. ఈ కోతుల బెడదకు ఒకవైపు చిన్నారులు, బాలింతలు, వృద్ధులు బెంబేలెత్తిపోతున్నారు.
● గైనిక్ విభాగం ఓపీ విభాగం ముందు భాగాన విరిగిపడి మూలనపడిన ఇనుపకుర్చీ నిరుపయోగంగానే పడివుంది.
● కడప జీజీహెచ్ (రిమ్స్)లో ప్రభుత్వం మంజూరు చేసిన స్టాఫ్ నర్సులు 402 కాగా వీరిలో రెగ్యులర్ స్టాఫ్ నర్సులు 62 మంది, కాంట్రాక్ట్ పద్ధతిలో 202 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇంకా 138 స్టాఫ్ నర్సుల పోస్టులు ఖాళీగా వున్నాయి. త్వరలోనే భర్తీ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా 13 మంది స్టాఫ్ నర్సులు వివిధ ఓపీ, ఐపీ, పరిపాలనా విభాగాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేవలం కంప్యూటర్ ఆపరేటర్ (డి.ఈ.ఓ) పనులను మాత్రమే నిర్వహిస్తున్నారు. వీరికి ఎలాంటి షిఫ్ట్ డ్యూటీలు లేకపోవడం, ఆయా పోస్టింగ్‌లకే అధికారులు పరిమితం చేయడం పలురకాల ఆరోపణలకు తావిస్తోంది. ఇంకా సిటీ స్కానింగ్ విభాగంలో అటెండర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్‌గా ఐదు సంవత్సరాలుగా విధులను నిర్వహిస్తున్నాడు. తనను కంప్యూటర్ ఆపరేటర్‌గా తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
● మరోవైపు కడప రిమ్స్ ఓపీలోని క్యాంటీన్ మూసివేత వ్యవహారం రోజురోజుకు ముదిరిపాకాన పడుతోంది. టెండర్ వేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అధికారులు ప్రస్తుత క్యాంటీన్ నిర్వాహకులను బలవంతంగా ఖాళీ చేయాలని చూస్తున్నారు. మొదటి రోజున ఏకంగా తాళళం వేసిన ఓ ప్రైవేట్ వ్యక్తి మూడవరోజున ఆ తాళం కాస్తా తీసేశాడు. మరోవైపు అధికారులు తగిన ఉత్తర్వులను ఇస్తే తాము ఖాళీ చేస్తామని ప్రస్తుత నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఓపెన్ టెండర్‌ను నిర్వహిస్తే అందరికీ మంచిదంటున్నారు.
కంటి మహిళా ఓపీలో
10:20 గంటలైనా రాని వైద్యులు
గైనిక్ ఓపీ ముందు మూలనపడ్డ కుర్చీ
13 మంది స్టాఫ్ నర్సులు
డీఈఓ ఉద్యోగాలకే పరిమితం
రిమ్స్‌లో తీరు మారదంతే..!


