
అటవీ భూమిని నిగ్గు తేలుస్తారా..!
ప్రొద్దుటూరు క్రైం : అన్యాక్రాంతమైన భూమిని నిగ్గు తేల్చేందుకు అటవీ, రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. గెజిట్‌లో కంటే సుమారు 140 ఎకరాల అటవీభూమి తగ్గడంతో అధికారులు ఈ సర్వే చేపట్టారు. ప్రొద్దుటూరు రేంజ్ పరిధిలో సుమారు 1044 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉండాలని అధికారిక గెజిట్‌లో ఉంది. అయితే రెవెన్యూ రికార్డుల్లో 904 ఎకరాలు అటవీ భూమి మాత్రమే చూపిస్తోంది. దీంతో రూ. కోట్లు విలువైన భూమి పెద్ద ఎత్తున అన్యాక్రాంతమైనట్లు లోకాయుక్తకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో అటవీ భూమిలో జరిగిన ఆక్రమణలను తొలగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అఽధికారులతో కలిసి అటవీ అధికారులు జాయింట్ సర్వే నిర్వహిస్తున్నారు. అటవీ భూమిని నిగ్గు తేల్చేందుకు రెండు శాఖలు సంయుక్తంగా ఈ సర్వే చేస్తున్నాయి.
పోట్లదుర్తి, రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్‌లోనే ఎక్కువగా వ్యత్యాసం
ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తి, ప్రొద్దుటూరు రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉండాల్సిన అటవీ భూమిలో ఎక్కువ వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రొద్దుటూరు ఎఫ్‌ఆర్‌ఓ హేమాంజలి ఆధ్వర్యంలో ల్యాండ్ సర్వే వారం రోజుల క్రితం ప్రారంభించారు. రామేశ్వరంలో సర్వే పూర్తి అయిందని గురువారం నుంచి మోడమీదిపల్లె ప్రాంతంలో సర్వే చేపట్టినట్లు ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు. రోగర్, జీపీఎస్ సాయంతో మార్కింగ్ వేసుకుంటూ అధికారులు సర్వే చేస్తున్నారు. సర్వే పూర్తి అయ్యాక నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని ప్రొద్దుటూరు ఎఫ్‌ఆర్‌ఓ హేమాంజలి తెలిపారు. ప్రస్తుతం మోడమీదిపల్లె ప్రాంతంలో సర్వే చేపట్టామని తెలిపారు.
ముమ్మరంగా రెవెన్యూ, అటవీశాఖ జాయింట్ సర్వే
ఫారెస్ట్ గెజిట్‌లో 1044 ఎకరాల
అటవీభూమి ఉండగా..
రెవెన్యూ రికార్డుల్లో
902 ఎకరాలు మాత్రమే ఉన్న వైనం