వైద్యుల నిర్లక్ష్యంతోనే మెడికో మృతి | - | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యంతోనే మెడికో మృతి

Jun 25 2024 12:06 AM | Updated on Jun 25 2024 7:57 AM

-

బనశంకరి: మంగళూరులో మెడిసిన్‌ పీజీ చదువుతున్న వైఎస్సార్‌ కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన వైద్య విద్యార్థిని వైద్యుల నిర్లక్ష్యంతోనే డెంగీ జ్వరంతో మృతిచెందిందని కుటుంబీకులు ఆరోపింయచారు. ఎర్రగుంట్ల మాజీ జడ్పీటీసీ సభ్యురాలు పి.మాధురి, వెంకటరమణారెడ్డి కుమార్తె పడిగపాటి సృజని (27) మంగళూరు వద్ద కేవీజీ మెడికల్‌ కాలేజీలో గైనకాలజీలో పీజీ విద్యార్థిని. నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో అదే మెడికల్‌ కాలేజీలోనే వైద్యం చేయించుకుంది. 

డెంగీ అని నిర్ధారణ కాగా ప్లేట్‌లేట్స్‌ తగ్గిపోయాయి. సరైన వైద్యం అందించకపోవడంతో ఆరోగ్యం విషమించింది. కాలేజీ సిబ్బంది ఆలస్యంగా తల్లిదండ్రులకు చెప్పడంతో హైదరాబాద్‌ నుంచి మంగళూరుకు బయలుదేరారు. డాక్టర్లు చేతులెత్తేసి మెరుగైన వైద్యం కోసం మంగళూరుకు వెళ్లాలని సూచించారు. వైద్య సిబ్బంది ఆమెను మంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో కోమాలోకి చేరుకుంది. కొన ఊపిరితో ఉన్న కుమార్తె ను చూసి తల్లడిల్లిపోయారు. చివరి మాటలకు కూడా నోచుకోలేదని విలపించారు. 21 తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కన్నుమూసిందని తల్లిదండ్రులు తెలిపారు.

స్పందన లేని వైద్యులు
తమ బిడ్డకు సరిగా వైద్యం చేయలేదని తల్లిదండ్రులు మంగళూరు నార్త్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కాలేజీకి వెళ్లి విచారణ జరిపారు. సృజని ట్రీట్‌మెంట్‌ గురించి వైద్యులు సరైన సమాధానం చెప్పలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. అదివారం తెల్లవారు జామున స్వగ్రామం పోట్లదుర్తికి మృతదేహాన్ని తీసుకువచ్చి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు.

త్వరలో కోర్సు పూర్తి..
సృజని చదువులో మంచి ప్రతిభాశాలి. ఇంటర్‌ పూర్తయిన తరువాత మొదటి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్‌ సీటు సాధించి హైదరాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీలో సీటు సంపాదించింది. తరువాత సుళ్యలో పీజీ కోర్సు చివరి ఏడాది చేస్తోంది. ఆమె మరణంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. త్వరలో ఎంఎస్‌ పూర్తి చేసుకుని వస్తుందని కోటి ఆశలతో ఉన్న తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడంలేదు. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ వైద్య విద్యార్థినికే కనీస వైద్యం అందించకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement