
మాట్లాడుతున్న రిజిస్ట్రార్ ఆచార్య వై.పి.వెంకటసుబ్యయ్య
వైవీయూ : దైనందిత సమస్యల పరిష్కారానికి సాంకేతికత వినియోగం ముఖ్యమైనదని వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య వై.పి.వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. సోమవారం వైవీయూ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ రెడ్డయ్య అధ్యక్షతన ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సెమినార్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ నిత్యజీవితంలో ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వంటి అనేక అప్లికేషన్లు భాగమయ్యాయని తెలిపారు. బ్యాంకుల్లో ఈ–అకౌంట్లు, సెల్‌ఫోన్లు ఇలా పలు అంశాల్లో సెక్యూరిటీ కోసం ఈ–అప్లికేషన్‌లను వాడుకుంటున్నామని పేర్కొన్నారు.
ఇలాంటి సెమినార్‌లు కొత్త జ్ఞానాన్ని అందిస్తాయని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ ఆచార్య కె. కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ డేటాల్లో పట్టుసాధించడం ద్వారా ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. బస్సులు వెళ్లలేని చోటికి సాంకేతిక పరికరాలు పంపి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరిస్తారన్నారు. రీసోర్స్ పర్సన్, ప్రొద్దుటూరు వైఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.నాగరాజు, వరంగల్ ఎన్‌ఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ యు.ఎస్.ఎన్. రాజు మాట్లాడుతూ మానవుల ప్రవర్తనను అనుకరించే యంత్రాలు, మెషిన్‌లెర్నింగ్ అనేది ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్ ఉపసమితి, ఇది యంత్రాలకు డేటాను అందించడం ద్వారా నిర్ణయాలు తీసుకునేలా చేయడంపై దృష్టి పెడుతుందన్నారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ రెడ్డయ్య సెమినార్ ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో సదస్సు కో కన్వీనర్ డాక్టర్ కె.శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు బి.సుశీల్‌కుమార్, ఎస్.శివజ్యోతి, సి.శ్వేత, జి.అమృతవాణి, బి.కరుణసాగర్, డాక్టర్ కె.హనుమంతునాయక్, కృష్ణయ్య, సి.వి.నారాయణరెడ్డి, రాజరాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య
వై.పి.వెంకటసుబ్బయ్య
రెండు రోజుల జాతీయ సెమినార్ ప్రారంభం