సాక్షి, యాదాద్రి : నల్లగొండ ఆర్టీసీ డిపోకు చెందిన ఎలక్ట్రికల్ బస్ సర్వీస్‌లను ఆదివారం నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్‌లోని ఉప్పల్ వరకు పొడిగిస్తున్నట్టు నల్లగొండ డిపో మేనేజర్ మేరి లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ బస్సులు భువనగిరి వరకు మాత్రమే నడుస్తున్నాయని, ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ఏడు బస్సులు 13 ట్రిప్‌లను భువనగిరి నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు పొడిగించామని పేర్కొన్నారు. భువనగిరిలో ఉదయం 6.30 గంటలకు తొలిబస్ ఉప్పల్‌కు బయలు దేరుతుందని తెలిపారు. అలాగే రాత్రి 8.10 గంటలకు చివరి బస్సు ఉప్పల్ నుంచి భువనగిరి మీదుగా నల్లగొండకు వెళ్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో జనగామ, హన్మకొండ వరకు నల్లగొండ నుంచి నేరుగా బస్సులను నడిపే అంశం పరిశీలనలో ఉందని ఆమె చెప్పారు.
జాతీయ రహదారిపై వారాంతపు రద్దీ
చౌటుప్పల్ : చౌటుప్పల్ పట్టణంలోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై శనివారం వాహనాల రద్దీ నెలకొంది. వీకెండ్‌తోపాటు వివాహాలు, ఇతర శుభకార్యాలు ఉండడంతో ప్రజలు పెద్దసంఖ్యలో రాకపోకలు సాగించారు. ఈ నేపథ్యంలో మండలంలోని ధర్మోజిగూడెం శివారు నుంచి మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం శివారు వరకు ఇరువైపులా వాహనాల రద్దీ ఏర్పడింది. విజయవాడ మార్గంలో వాహనాలు బంపర్ టు బంపర్‌గా ముందుకు సాగాయి. ఈ రద్దీ అర్ధరాత్రి వరకు కొనసాగింది.
వైజ్ఞానిక ప్రదర్శనను జయప్రదం చేయాలి
భువనగిరి : వలిగొండలోని శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిసెంబర్ 4, 5 తేదీల్లో నిర్వహించే జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనను జయప్రదంచేయాలని డీఈఓ భిక్షపతి కోరారు. శనివారం భువనగిరి మండలం రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రదర్శన నిర్వహణకు 14 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ప్రదర్శన నిర్వహణ కమిటీ చైర్మన్‌గా కలెక్టర్ అనురాగ్ జయంతి వ్యవహరిస్తారన్నారు. విజ్ఞాన ప్రదర్శనకు వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్‌ఓ రాజశేఖర్, డీసీఈబీ సెక్రటరీ పాండునాయక్, ఎంఈఓ రంగరాజన్, ప్రధానోపాధాయురాలు అండాలు తదితరులు పాల్గొన్నారు.


