ప్రభుత్వం సహాయం అంధించాలి
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జలాశయ తీరంలో జీవించే వేలాది మంది మత్స్యకార కుటుంబాల జీవనోపాధిపై ఎండలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చేపలు నీటి అడుగు భాగంలోనే ఉంటుండటంతో వలలకు చిక్కడం లేదు. ఎప్పుడూ చేపల వేటతో సందడిగా ఉండే జలాశయ తీరం ప్రస్తుతం వెలవెలబోతుంది. సుదూర ప్రాంతాలకు మర పడవల్లో వెళ్లి గంటల తరబడి వేట సాగించినా చేపలు చిక్కక పస్తులు ఉండే పరిస్థితి నెలకొందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 10గంటలు దాటితే ఎండ తీవ్రత పెరిగిపోతుండటంతో మత్స్యకారులు పుట్టీల కింద కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దాదాపు 10వేల మత్స్యకార కుటుంబాలు సాగర్ జలాశయంలో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. డ్యాం నిర్మాణ సమయంలో ఏపీలోని విశాఖపట్నం నుంచి వలస వచ్చిన కుటుంబాలతో పాటు స్థానిక గ్రామాలు, తండాలకు చెందిన అనేక మంది చేపల వేట పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం చేపల వేట దాదాపుగా నిలిచిపోవడంతో రోజువారి ఆదాయం పూర్తిగా పడిపోయిందని, పిల్లల చదువులు, కుటుంబ పోషణ కష్టంగా మారిందని మత్స్యకారులు చెబుతున్నారు.
మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి. రేషన్ కార్డుల మీద ఇచ్చే బియ్యంతో పాటు అదనంగా బియ్యం ఇవ్వాలి. జీవన వ్యయం కోసం జూలై మాసం వరకు ప్రతి మత్స్యకార కుటుంబానికి నెలకు రూ.5వేలు ఆర్థికసాయం అందించాలి. – కోదండం,
మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షుడు
ఫ సాగర్ జలాశయంలో
వలలకు చిక్కని చేపలు
ఫ కష్టంగా కుటుంబ పోషణ
ఫ ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు


