తొందర వద్దు
సాక్షి, యాదాద్రి: వానాకాలం సీజన్ ఆరంభంలోనే పత్తి రైతుకు కష్టాలు మొదలయ్యాయి. వరుణుడు ముఖం చాటేయడం, భానుడి ప్రతాపంతో భూమి లో నాటిన పత్తి గింజలు తేమలేక మొలకెత్తకుండానే మాడిపోతున్నాయి. తొలకరి జల్లుల నమ్మకంతో ముందస్తుగా విత్తనాలు వేసిన రైతులు వర్షం కురువక నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.
50వేల ఎకరాల్లో పత్తి సాగు
ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో సుమారు 1,30,000 నుంచి 1.35,000 ఎకరాలలో పత్తి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ వర్షాలు సకాలంలో పడకపోవడంతో లక్ష్యానికి అనుగుణంగా సాగు సాగలేదు. జిల్లాలోని ఆలేరు, మోత్కూరు, రాజాపేట, మోటకొండూరు,ఆత్మకూర్‌ఎం, గుండాల, వలిగొండ, చౌటుప్పల్, నారాయణపురం, రామన్నపేట, అడ్డగూడురు, భువనగిరి ఇలా పలు మండలాల్లో పత్తి సాగు చేశారు. సుమారు 50 వేల ఎకరాల్లో పత్తి గింజలు నాటారు.
ఏడు మండలాల్లో పడిపోయిన వర్షపాతం
ప్రస్తుతం వానాకాలంలో జిల్లాలో వర్షపాతం తీవ్రంగా పడిపోయింది. ఈనెల 1నుంచి 17వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 60.9 మి.మీ.కు గాను కేవలం 36.6 మి.మీ. మాత్రమే నమోదైంది. అంటే సాధారణం కంటే 40 శాతం తక్కువ వర్షపాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేవలం వలిగొండ, నారాయణపూర్, చౌటుప్పల్, బొమ్మల రామారం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇక మరో ఏడు మండలాలైన రాజాపేట, ఆలేరు, భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, రామన్నపేట, అడ్డగూడూరులలో వర్షపాతం పడిపోయింది. మరో ఆరు మండలాలుతుర్కపల్లి, మోటకొండూర్, యాదగిరిగుట్ట, ఆత్మకూర్, మోత్కూర్, గుండాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు గుర్తించారు.
సరిపడా వర్షం కోసం ఎదురు చూపులు
పత్తి రైతులు సరిపడా వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. మృగశిర కార్తె వచ్చి పది రోజులు దాటుతున్నా జిల్లాలో ఇప్పటి వరకు సరైన వర్షం కురువలేదు. కొన్ని చోట్ల చిరుజల్లులు పడితే పత్తి విత్తనాలు మొలకెత్తాయి. ఆ తర్వాత వర్షం లేక అవి ఎండిపోతున్నాయి. దీంతో ఒక్కో ఎకరానికి రైతులు రూ.5వేల నుంచి రూ.8 వేల వరకు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే రెండోసారి విత్తనాలు నాటుకోవడానికి సైతం రైతులు సిద్ధమవుతున్నారు.
జిల్లాలో ఈనెల 1నుంచి 17 వరకు వర్షపాతం(మి.మీలలో)
సాధారణం 60.9
నమోదైంది 36.6
ఫ తొలకరికి పత్తి గింజలు విత్తుకున్న రైతులు
ఫ వానలు లేక మొలకెత్తని దైన్యం
ఫ జిల్లాలో సాధారణం కంటే 40శాతం తక్కువ వర్షపాతం నమోదు
ఫ వరుణుడి కోసం ఆకాశంవైపు చూస్తున్న రైతన్న
ఈ ఫొటోలో వ్యక్తి పేరు గూడెపు అబ్బయ్య. సొంతూరు అడ్డగూడూరు. ఈ రైతులకు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా మరో 10 ఎకరాలు కౌలుకుతీసుకున్నాడు. కానీ ఈనెల 5న 10 ఎకరాల్లో పత్తి విత్తనాలు పెట్టాడు. సకాలంలో వర్షాలు కురువక విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో రూ. 30 వేల వరకు నష్టం వచ్చింది. వర్షం పడితే మరోసారి విత్తనాలు వేసుకుంటానని చెబుతున్నాడు.
రుతుపవనాల కదలికలు మందగించాయి. పొడినేలల్లో పత్తి విత్తనాలు వేసి నష్టపోవద్దు. భూమిలో కనీసం రెండు, మూడు ఇంచుల వరకు తేమ ఉంటేనే విత్తనం మొలకెత్తుతుంది. మంచి వర్షాలు కురిసే వరకు వేచి చూస్తే మంచిది. విత్తనాలు కూడా లైసెన్స్‌డ్ డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి.
– పీవీ వెంకటరమణారెడ్డి,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి


