యువతను పట్టిపీడిస్తున్న క్రికెట్‌ బెట్టింగ్‌ మహమ్మారి | - | Sakshi
Sakshi News home page

యువతను పట్టిపీడిస్తున్న క్రికెట్‌ బెట్టింగ్‌ మహమ్మారి

Apr 24 2026 7:26 AM | Updated on Apr 24 2026 7:26 AM

ఒక్క క్లిక్‌తో లక్షల ఆశ.. చివరికి అప్పులపాలు

తీర్చేదారిలేక బలవన్మరణాలు

వీధిన పడుతున్న కుటుంబాలు

సాక్షి, యాదాద్రి : ఐపీఎల్‌ బెట్టింగ్‌ మహమ్మారి కోరలు చాస్తోంది. టాస్‌ పడకముందే మొదలవుతున్న జూదం.. మ్యాచ్‌ ముగిసేసరికి ఎందరో యువకుల జీవితాలను రోడ్డున పడేస్తోంది. లక్షల్లో అప్పులు.. తీర్చలేక ఆత్మహత్యలు.. వెరసి కుటుంబాల్లో బెట్టింగ్‌ సెగ పెను విషాదాన్ని నింపుతోంది. వివిధ మండలాల్లో వెలుగుచూస్తున్న ఘటనలు చూస్తుంటే.. ఈ ఆన్‌లైన్‌ జూదం ఎన్ని కుటుంబాలను బలితీసుకుంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

రూ.లక్షల్లో అప్పులు చేస్తున్న యువత

ఐపీఎల్‌ ప్రారంభంతోనే బెట్టింగ్‌ దందా పెరిగింది. ఐపీఎల్‌ 2026 ప్రారంభంతోనే అన్ని మండలాల్లో ఆన్‌లైన్‌ యాప్‌లు, బుకీల ద్వారా బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. యువత, విద్యార్థులు వివిధ వర్గాల వారు బెట్టింగ్‌ కోసం లక్షల అప్పులు చేస్తున్నారు. మ్యాచ్‌ విన్నర్‌, టాస్‌ విన్నర్‌, సెషన్‌ బెట్టింగ్‌, ఏ బ్యాటర్‌ ఎక్కువ రన్స్‌, ఏ బౌలర్‌ ఎక్కువ వికెట్లు తీస్తారు. బాల్‌బై బాల్‌, ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌, వికెట్‌ పడే తీరు, ఓవర్‌కు ఎన్ని రన్స్‌ కొడతారు ఇలా పలు రకాల బెట్టింగ్‌లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. మున్సిపాలిటీలు, గ్రామాల్లోని యువత వీటి మోజులో పడి లక్షల రూపాయలు నష్టపోతోంది. మొదట్లో చిన్న మొత్తంతో మొదలై, ఆ తర్వాత పందెం పెంచుకుంటూ పోయి లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు.

కుటుంబాల్లో చీకట్లు

బెట్టింగ్‌ కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఆ వ్యక్తిని నమ్ముకున్న కుటుంబాన్ని కూడా రోడ్డున పడేస్తోంది. కొడుకు ప్రయోజకుడవుతాడని ఆశపడ్డ తల్లిదండ్రులకు.. అప్పుల వాళ్లు ఇంటికి వచ్చి నిలదీస్తుంటే ఏం చేయాలో పాలుపోవడం లేదు. పచ్చని సంసారాల్లో ఈ బెట్టింగ్‌ చిచ్చు పెడుతోంది.

పోలీసుల నిఘా అవసరం

జిల్లాలో జోరుగా సాగుతున్న ఈ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నెట్‌వర్క్‌లపై పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో, పట్టణాల్లో యువతకు అవగాహన కల్పించడంతో పాటు, రహస్యంగా సాగుతున్న ఈ దందాను అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

చౌటుప్పల్‌ పట్టణంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల వల్ల అయిన అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉపాధి కోసం హైదరాబాద్‌ వెళ్లి డ్రైవింగ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషించినా, వ్యసనం వదలకపోవడంతో చివరకు ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. నేడు అతని భార్య, ఇద్దరు పిల్లలు అప్పుల భారంతో

సతమతమవుతున్నారు.

బొమ్మలరామారం మండలంలో బెట్టింగ్‌ మోజులో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈసంఘటన స్థానికంగా కలకలం రేపింది. అప్పులు తీర్చలేక తన ప్లాట్‌ను, అంతకుముందు భూమిని విక్రయించినా ఫలితం లేకపోయింది. మళ్లీ రూ. 25 లక్షల వరకు అప్పులు పేరుకుపోయాయి. దిక్కుతోచక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని భార్య పిల్లలు అనాథలయ్యారు. ఇదే మండలంలో మరో యువకుడు ఏకంగా 30 లక్షల రూపాయలు పోగొట్టుకుని, ఇంట్లోని బంగారాన్ని తాకట్టు పెట్టాడు.

Advertisement
 
Advertisement
Advertisement