పురుషులకూ ఉచిత ప్రయాణం
రామగిరి(నల్లగొండ) : ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె గురువారం రెండవ రోజూ కొనసాగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. డిపోల నుంచి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. అయితే ఆర్టీసీ అధికారులు గురువారం 398 బస్సులు నడిపారు. వీటిలో ఆర్టీసీ 10, ఎలక్ట్రిక్, అద్దె బస్సులు 388 ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా కండక్టర్లను నియమించారు. ప్రధాన రూట్లలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఎక్కువ సర్వీస్‌లను ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రైవేట్ వాహనదారులు చార్జీలు భారీగా పెంచారు. మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు సుమారు రూ.500 వరకు వసూలు చేశారని.. ప్రయాణికులు పేర్కొన్నారు.
అన్ని డిపోల వద్ద ఉద్రిక్తత
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఉద్రిక్త పరిస్థితిలు నెలకొన్నాయి. నల్లగొండ డిపో వద్ద డ్రైవర్ వెంకన్న ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సూర్యాపేట డిపో లో బస్సులు నడవకుండా ఉద్యోగులు అడ్డుకున్నారు. కాసేపు పోలీసులు, ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ఆర్టీసీ ఉద్యోగులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించడంతో బస్సులు నడిచాయి. యాదగిరిగుట్టలో కూడా ఉద్యోగులు డిపో ముందు బైఠాయించి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. అద్దె బస్సుల పార్కింగ్ వేరే చోట ఉండడంతో ఆర్టీసీ అధికారులు అక్కడి నుంచి బస్సులను నడిపించారు. యాదగిరిగుట్ట, కోదాడ డిపోల్లో ఉద్యోగులు ధర్నా వద్ద ఏర్పాటు చేసుకున్న టెంట్‌లను పోలీసులు తొలగించారు. కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆందోళనలో పాల్గొని సమ్మెకు మద్దతు తెలిపారు. నార్కట్‌పల్లి డిపోలో జరిగిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, యాదగిరిగుట్టలో ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత, సీపీఐ రాష్ట్ర నాయకుడు గోదా శ్రీరాములు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రచ్చ శ్రీనివాస్ సమ్మెకు మద్దతు తెలిపారు. మిర్యాలగూడలో సీపీఎం, సీపీఐతోపాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు సమ్మెకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు.
ఫ అన్ని డిపోల ఎదుట బైఠాయించిన కార్మికులు
ఫ సూర్యాపేటలో ఉద్యోగులు, పోలీసుల మధ్య తోపులాట
ఫ యాదగిరిగుట్ట, కోదాడలో ధర్నా టెంట్‌ల తొలగింపు
ఫ నల్లగొండలో కార్మికుడి ఆత్మహత్యాయత్నం
మిర్యాలగూడ టౌన్ : ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో అధికారులు అద్దె, ఎలక్ట్రిక్ బస్సులను పాక్షికంగా నడిపారు. కండక్టర్లు కొరత ఉండడంతో కొన్ని బస్సుల్లో మహిళలతోపాటు పురుషులకు కూడా ఉచితంగా ప్రయాణించారు. మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు వెళ్లే అద్దె బస్సు డ్రైవర్‌కు ఆర్టీసీ అధికారులు ఇచ్చిన కాగితంపై ప్రయాణికులందరికీ ఫ్రీ అని రాసి ఉంది. కాగా కండక్టర్లు లేకపోవడంతో పురుషులు ఉచితంగా ప్రయాణించారని.. శుక్రవారం నుంచి తప్పనిసరిగా పురుషులు టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.


