ఇంటికే సరుకులు | - | Sakshi
Sakshi News home page

ఇంటికే సరుకులు

Apr 24 2026 7:26 AM | Updated on Apr 24 2026 7:26 AM

క్షేత్రస్థాయిలో టీచర్లకు బాధ్యతలు

భువనగిరిటౌన్‌ : రాష్ట్రంలో భానుడి భగభగలు మొదలయ్యాయి. ఏప్రిల్‌ నెలలోనే ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీలకు చేరుకోవడంతో సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 31 వరకు అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనేపథ్యంలో వారి ఇళ్లకే వెళ్లి సరుకులు ఇవ్వాలని నిర్ణయించారు.

ఇప్పటికే సమయాల్లో మార్పు..

ప్రస్తుతం ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్‌వాడీ కేంద్రాల పనివేళలను ప్రభుత్వం ఇప్పటికే సవరించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకే కేంద్రాలను నిర్వహిస్తున్నారు. కేంద్రాల్లో ఫ్యాన్లు లేకపోవడం, వేడి గాలుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో లబ్ధిదారులకు ఉపశమనం కలిగించేందుకు నెల రోజుల పాటు సెలవులు ఇచ్చారు. సెలవుల కారణంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో వడ్డించే భోజనానికి అంతరాయం కలగకుండా ప్రభుత్వం టేక్‌ హోమ్‌ రేషన్‌ విధానాన్ని అమలు చేస్తోంది. మే నెలకు సరిపడా సరుకులను లబ్ధిదారుల ఇళ్లకు పంపిణీ చేయనున్నారు.

గర్భిణులు, బాలింతలకు : నెలకు సరిపడా బియ్యం, పప్పు, నూనె, పాల ప్యాకెట్లను

అందజేస్తారు.

చిన్నారులకు : 7 నెలల నుంచి 3 ఏళ్ల లోపు పిల్లలకు బాలామృతంతో పాటు 16 కోడిగుడ్లు, 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలకు బియ్యం, పప్పు, నూనె, కురుకురే ప్యాకెట్లను పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు.

కేంద్రాలకు సెలవులు ఉన్నప్పటికీ, అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. 0 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లల ఇళ్లను సందర్శించి వారి ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించాలి. శారీరక, మానసిక ఎదుగుదల లోపించిన పిల్లలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించాలి. అలాగే ప్రభుత్వం సూచించిన బాలల సంరక్షణ వారోత్సవాలు (ఏప్రిల్‌ 27 – మే 2), మహిళా వారోత్సవాలను (మే 25 – మే 30) విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. జిల్లాలో మొత్తం 901 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 0–3 సంవత్సరాల చిన్నారులు 26106, 3 నుంచి 6 సంవత్సరాల వారు 18,850, గర్భిణులు 5,024, బాలింతలు4,392 మంది సేవల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఆలేరు, మోత్కూర్‌, భువనగిరి, రామన్నపేట ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఈ ప్రక్రియను సమర్థంగా అమలు చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది.

ఫ వచ్చేనెల 1 నుంచి అంగన్‌వాడీలకు వేసవి సెలవులు

ఫ చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఇళ్లకు వెళ్లి సరుకుల పంపిణీ

ఫ టీచర్లు, ఆయాలకు బాధ్యతలు

Advertisement
 
Advertisement
Advertisement