సాక్షి, యాదాద్రి : రైస్ మిల్లర్లు బియ్యం నాణ్యత, డెలివరీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి ఎఫ్‌సీఐ అధికారులు, రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో భాస్కర్‌రావు మాట్లాడారు. బియ్యం తిరస్కరణకు గురికావడానికి గల కారణాలను భారత ఆహార సంస్థ అధికారులతో క్షుణ్ణంగా చర్చించామన్నారు. నిబంధనల ప్రకారం ఉన్న బియ్యం సేకరణలో మిల్లర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని భారత ఆహార సంస్థ అధికారులు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రోజారాణి, జిల్లా మేనేజర్ హరికృష్ణ, భారత ఆహార సంస్థ అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
డీఐఈవోగా సురేష్‌రెడ్డి
భువనగిరి: జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా సురేష్‌రెడ్డి నియమితులయ్యారు. ఇప్పటి వరకు భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసిన రమణి డీఐఈవో విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె మహబూబ్‌నగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా పదోన్నతి పై వెళ్లారు. ఆమె స్థానంలో భూదాన్‌పోచంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సురేష్‌ను నియమించారు. దీంతో గురువారం బాధ్యతలు స్వీకరించారు.
జీవితాన్ని మార్చే ఆయుధం విద్య
రాజాపేట : జీవితాన్ని మార్చే ఆయుధం విద్య అని డీఈఓ కందుల సత్యనారాయణ పేర్కొన్నారు. రాజాపేట మండలంలోని పాముకుంట, రాజాపేట ఉన్నత పాఠశాలల్లో వార్సికోత్సవాలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు కలలు కని వాటి సాకారం కోసం కృషిచేయాలన్నారు. ఉన్నత శిఖరాలు అధిరోహించి దేశానికి, తల్లిదండ్రులకు, గురువులకు పేరుతేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కోయ మధు, రంగ నరేష్ గౌడ్, ఎంఈఓ చందా రమేష్, ప్రధానోపాధ్యాయుడు రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. గురువారం వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.


