పెద్దవూర : బిందు సేద్యానికి ఉపయోగించే డ్రిప్ పరికాలను సకాలంలో శుభ్రం చేసుకోవడం వలన వాటి మన్నిక పెరగడంతో పాటు నీటి పారుదల బాగుంటుందని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ రైతులకు సూచిస్తున్నారు. వంద అడుగులకు పైగా పడిపోయిన భూగర్భజలాలు, చెరువులు, కుంటలు, వాగుల నుంచి వచ్చే సన్నటి మన్ను, నాచు, ఎరువులు బిందు సేద్యం పరికాలను దెబ్బతీస్తాయని అన్నారు. తద్వారా మోటార్లపై భారం పడి అవి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. డ్రిప్ పరికరాలు ఎలా శుభ్రం చేసుకోవాలో ఆయన మాటల్లోనే..
స్క్రీన్ ఫిల్టర్ శుభ్రత కీలకం
బోరు బావుల నుంచి వచ్చే నీటిలో సన్నటి మట్టి అధికంగా వస్తుంది. దీని వలన లేటరల్ పైపుల నుంచి నీరు వచ్చే మార్గాలు మూసుకుపోతాయి. దీని నివారణకు బోరు వద్ద నుంచి లేటరల్ పైపులకు నీరు వచ్చే ముందు స్క్రీన్ ఫిల్టర్‌ను అమర్చుతారు. దీన్ని వారం రోజులకు ఒకసారి నీటితో శుభ్రం చేయాలి. ఫిల్టర్‌పై సన్నటి రంధ్రాలు పూడిపోకుండా చూసుకోవాలి. కొత్తగా వేసిన బోర్లు అయితే రోజుకు ఒకసారి అయినా ఫిల్టర్‌ను శుభ్రం చేసుకోవడం మంచిది. బావుల నుంచి నీటిని తీసుకుంటున్నప్పుడు సాండ్ ఫిల్టర్‌ను అమర్చుకోవాలి. రెండు ఫిల్టర్ల వలన రెండు దఫాలుగా వడపోత జరిగి లేటరల్ పైపుల్లోకి మట్టి చేరకుండా ఉంటుంది.
లేటరల్ పైపులకు యాసిడ్ ట్రీట్‌మెంట్
డ్రిప్ పరికరాల ద్వారా అందించే ఎరువుల వలన లేటరల్ పైపులకు ఉన్న రంధ్రాలు మూసుకుపోతాయి. తద్వారా నీరు కిందికి రావడం నిలిచిపోయి మొక్కలకు నీరు అందదు. ఏడాదికి ఒకసారి పైపులను శుభ్రపర్చుకోవాలి. ఇందుకోసం తక్కువ గాఢత గల హైడ్రోక్లోరిక్ లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను వాడతారు. యాసిడ్‌ను ఉపయోగించి పైపులను శుభ్రపరిచేందుకు రెండు పద్దతులు పాటించవచ్చు. ఎకరా పొలంలో గల లేటరల్ పైపులను శుభ్రపరిచేందుకు ఒకటి నుంచి రెండు లీటర్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవసరం అవుతుంది. పది మీటర్ల హూస్ పైపును తీసుకుని రెండువైపులా కట్టెలను పాతి యూ ఆకారంలో అమర్చాలి. హూస్ పైపునకు ఒకవైపు నుంచి నుంచి నాలుగేసి లేటరల్ పైపులను జాగ్రత్తగా బయటకి తీసుకోవాలి. ఆపై పైపులను రెండు రోజుల పాటు వాడకుండా వదిలేయాలి. మూడోరోజు సబ్ లైన్‌కు బిగించి నీటిని వదిలేయాలి. ఒకరోజు తర్వాత మొక్కలకు నీరందించడానికి పైపులు బిగించాలి.
● రెండో పద్ధతిలో ఎరువులను వదిలే ప్లాస్టిక్ ఫెర్టిగేషన్ ట్యాంకు ద్వారా శుభ్రపర్చడం. పంట లేని సమయాల్లో మాత్రమే ఈ పద్ధతిని అవలంబించాలి. ప్లాస్టిక్ ఫెర్టిగేషన్ ట్యాంకును ముందుగా శుభ్రపర్చుకుని, తక్కువ గాఢత గల యాసిడ్‌ను, తర్వాత నీటిని అందులోకి పంపాలి. ఈ ప్రక్రియ మెల్లగా జరిగే విధంగా చూడాలి. ఆపై గేట్‌వాల్వ్‌లను నియంత్రిస్తూ యాసిడ్ ఉన్న నీటిని మెయిన్ లైన్ గుండా సబ్‌లైన్ ద్వారా లేటరల్ పైపులకు పంపాలి. ఇందుకోసం ఎక్కడ లీకేజీ లేకుండా చూసుకోవాలి. ఇనుప ఫెర్టిగేషన్ ట్యాంకు ఉన్నట్లయితే వెంచురీ సాయంతో లేటరల్ పైపులను శుభ్రం చేసుకోవడం ఉత్తమం. దీనివలన యాసిడ్ ఉన్న నీరు వెళ్తున్న తీరు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అరగంట పాటు యాసిడ్ ప్రక్రియ సాగితే లేటరల్ పైపులకు ఉన్న చిన్న రంధ్రాల్లో మలినాలు తొలగిపోయి పూర్తి స్థాయిలో శుభ్రపడతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పంటలు ఉన్న సమయాల్లో యాసిడ్ ద్వారా పైపులను శుభ్రపర్చరాదు.
డ్రిప్ కంపెనీలు సూచించిన యాసిడ్‌ను వారు నిర్ధేశించిన మోతాదు మేరకే వాడాలి.
నీటిలో యాసిడ్ కలపాలి. యాసిడ్ ఉన్న ట్యాంకులో నీరు పోయవద్దు.
ఫెర్టిగేషన్ లేదా వెంచురీ సాయంతో యాసిడ్‌ను పంపేటప్పుడు నీటిని వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
పైపులు శుభ్రపడిన అనంతరం ఎండ్ క్యాపులను తీసేసి యాసిడ్ కలిపిన నీటిని వదిలేయాలి.
శుభ్రపరిచిన పైపులను సైతం మళ్లీ ఒకసారి నీటితో కడగడం లేదా సబ్‌లైన్‌కు బిగించి నీటిని పారనివ్వాలి.
శుభ్రపరిచే సమయాల్లో రైతులు ముఖానికి, చేతులకు తొడుగులు విధిగా ధరించాలి. వీలైతే చలువ కళ్లద్దాలు వేసుకోవడం ఉత్తమం.
రసాయనిక ప్రక్రియ కాకుండా అయితే లేటరల్ పైపుల చివరన ఉన్న ఎండ్ క్యాపులను వారానికి ఒకసారి తీసి పది నిమిషాల పాటు నీటిని వదలాలి. తద్వారా లేటరల్ పైపులు శుభ్రపడతాయి.
మెయిన్ లైన్ చివరన గల ఎండ్ క్యాపులను సైతం తీసి ఉంచడం వలన నీటిలో గల మలినాలు శుభ్రపడతాయి.


