నాగార్జునసాగర్ : ఎండలు మండుతున్న వేళ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉండగా.. నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల్లో మాత్రం కృష్ణానది నిండుగా ప్రవహిస్తుండడంతో కృష్ణపట్టె తండాల వాసులకు వరంలా మారింది. కృష్ణపట్టె పైభాగాన నాగార్జునసాగర్ జలాశయం, దిగువన కృష్ణానది ఉండటం వల్ల ఈ ప్రాంతంలో నీటికొరత అనే మాటే వినిపించడం లేదు. సాగర్ పైభాగాన సుమారు 110 చదరపు కిలోమీటర్ల పరిధిలో, అలాగే డ్యాం నుంచి 21.5 కిలోమీటర్ల మేర టెయిల్‌పాండ్ వరకు నదిలో నీరు సమృద్ధిగా నిల్వ ఉంది. టెయిల్‌పాండ్ దిగువన పులిచింతల ప్రాజెక్టు ఉండటం వల్ల ఆ ప్రాంతంలో కూడా నీటినిల్వలు నిలకడగా కొనసాగుతున్నాయి. కృష్ణా తీరం వెంట ఉన్న గిరిజన తండాల వాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా, పశువుల సంరక్షణలోనూ ఎలాంటి సమస్యలు లేకుండా జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో నీటి కొరతతో ఇబ్బందులు పడే మైదాన ప్రాంతాలతో పోలిస్తే కృష్ణా తీరం వెంట జీవనం సాఫీగా కొనసాగుతోంది. రైతులు నదిలో సొంతంగా విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసుకోని నీటిని ఎత్తి పొలాలకు చేరవేసుకుంటూ కూరగాయలు, పత్తి, మిరప తదితర వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. ఎండాకాలంలో కృష్ణా నది నిండుగా ఉండటం తమకు ప్రకృతి ప్రసాదించిన వరమని ఆయా తండాల వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య
కృష్ణాతీర ప్రాంతాలకు పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. నదీ అందాలు, చుట్టూ ఉన్న వాతావరణం సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
ఫ కృష్ణపట్టె తండాల వాసులకు
నీటి ఎద్దడి నుంచి ఉపశమనం
ఫ పశువులకు, పంటలు పండించేందుకు ఉపయోగపడుతున్న నీరు


