చిత్రం రవికి లైఫ్‌ సేవియర్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

చిత్రం రవికి లైఫ్‌ సేవియర్‌ అవార్డు

Apr 24 2026 5:44 AM | Updated on Apr 24 2026 5:44 AM

పెన్‌పహాడ్‌ : మండలంలోని మాచారం గ్రామానికి చెందిన చిత్రం రవికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా కీసరలో 108 అంబులెన్స్‌ ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న రవి గురువారం గ్రీన్‌ హెల్త్‌ సర్వీస్‌ సంస్థ డైరెక్టర్‌ జీవీకే రెడ్డి, చైర్మన్‌ కృష్ణంరాజు, రాష్ట్ర హెడ్‌ సుధాకర్‌ చేతుల మీదుగా జాతీయ స్థాయిలో లైఫ్‌ సేవియర్‌ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గోల్డ్‌ మెడల్‌, నగదు బహుమతి అందుకున్నారు.

గేదెలను

అపహరించిన దొంగలు

మిర్యాలగూడ : ఇంటి ఆవరణలో కట్టేసిన పాడి గేదెలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటన దామరచర్ల మండలం కేశవాపురం గ్రామంలో జరిగింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. కేశవాపురం గ్రామానికి చెందిన రైతు ఆలకుంట రాములు తన నాలుగు పాడి గేదెలను రోజుమాదిరిగానే బుధవారం సాయంత్రం ఇంటి ఆవరణలో కట్టేశాడు. గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు గేదెలకు కట్లు విప్పి కొంతదూరం తీసుకెళ్లి అశోక్‌ లేలాండ్‌ వాహనంలోకి ఎక్కించారు. అప్పటికే ఆ వాహనంలో మరో మూడు గేదెలు ఉన్నాయి. వాహనం నెమ్మదిగా వెళ్తుండగా గ్రామస్తులు గమనించి ద్విచక్ర వాహనంపై వెంబడించారు. దీంతో అతివేగంగా నార్కట్‌పల్లి–అద్దంకి రహదారి పైకి చేరుకుని గుంటూరు వైపు పారిపోయారు. బాధిత రైతు సమీపంలో ఉన్న రై్‌స్‌ మిల్లు, పెట్రోల్‌ బంకుల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా తెలుపు రంగు వాహనంలో గేదెలు తరలిస్తున్నట్లుగా రికార్డయ్యింది. దీంతో వాడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు బాధిత రైతు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఐదు గ్యాస్‌ సిలిండర్లు స్వాధీనం

భువనగిరిటౌన్‌ : భువనగిరి పట్టణంలోని పాత బస్టాండ్‌ సమీపంలో గల టిఫిన్‌ సెంటర్లలో పట్టణ ఎస్‌ఐ నరేష్‌ ఆధ్వర్యంలో గురువారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా గృహ అవసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లను టిఫిన్‌ సెంటర్లలో వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐదు సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత హోటళ్ల నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కూసుమంచి : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌ సమీపాన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెం గ్రామానికి చెందిన ఎస్‌కే అబ్దుల్‌ కపూర్‌(30) ఖమ్మంలోని ఓ మోటార్‌ సైకిల్‌ షోరూంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. గత నెల ఉద్యోగం మానేయగా.. గతంలోనే రహదారి ప్రమాదంలో గాయపడిన ఆయన మానసిక ప్రవర్తన సరిగా ఉండడం లేదు. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోగా మనోవేదనకు గురవుతున్న కపూర్‌ పాలేరు రిజర్వాయర్‌ అలుగుల వద్ద గురువారం చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement