‘దుశ్చర్ల’పై గొర్రెల కాపరుల దాడి | - | Sakshi
Sakshi News home page

‘దుశ్చర్ల’పై గొర్రెల కాపరుల దాడి

Apr 24 2026 5:44 AM | Updated on Apr 24 2026 5:44 AM

పథకం ప్రకారమే దాడి చేశారు

సూర్యాపేట టౌన్‌, మోతె : ప్రకృతి ప్రేమికుడు, జలసాధన సమితి వ్యవస్థాపకుడు దుశ్చర్ల సత్యనారాయణపై గొర్రెల కాపరులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామంలో గురువారం సాయంత్రం జరిగింది. రాఘవపురం గ్రామంలో తనకున్న 70 ఎకరాల భూమిలో దుశ్చర్ల సత్యనారాయణ వివిధ రకాల చెట్లను పెంచి అడవిగా మార్చారు. ఆ అడవి పక్కనే బయ్య లింగయ్య, మేకల కృష్ణయ్య వ్యవసాయ భూములు ఉన్నాయి. వారు తమ గొర్రెలను మేపేందుకు తరచూ దుశ్చర్ల సత్యనారాయణ అడవిలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆయన మాత్రం అందులోకి ఎవరినీ రానివ్వకుండా చూస్తున్నారు. కాగా గురువారం ఆయన లేని సమయంలో బయ్య లింగయ్య, మేకల కృష్ణయ్య మేకలు, గొర్రెలు మేపుతూ దుశ్చర్ల సత్యనారా యణ అడవిలోని చెట్ల కొమ్మలను నరికి వాటిని మేపుతుండగా.. ఇది గమనించిన దుశ్చర్ల తన అడవిలోకి గొర్రెలను ఎందుకు మేపుతున్నారని గొర్రెల కాపరులను ప్రశ్నించాడు. ఈ క్రమంలో వారి మధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న బయ్య లింగయ్య ముగ్గురు కుమారులతో పాటు మరికొందరు వచ్చి దుశ్చర్ల సత్యనారాయణపై కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

తాను సృష్టించిన అడవిలో మేకలు, గొర్రెలు ఎందుకు మేపుతున్నారని అడిగితే ‘మా ఇష్టం.. ఇలానే మేపుతాం’ అని బెదిరించారని దుశ్చర్ల సత్యనారాయణ తెలిపారు. ఈ 70 ఎకరాల అడవిని కొందరు స్వార్ధపరులు ఆక్రమించుకునేందుకే పథకం ప్రకారం తనను హత్య చేయాలనే దాడికి పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. తనకు పోలీసులు రక్షణ కల్పించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఫ తలకు తీవ్ర గాయాలు

ఫ సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స

Advertisement
 
Advertisement
Advertisement