కోదాడరూరల్ : మహిళను కత్తితో బెదిరించి ఆమె మెడలోని బంగారు గొలుసు దుండగుడు అపహరించాడు. ఈ ఘటన కోదాడ పట్టణంలో గురువారం జరిగింది. కోదాడ పట్టణంలోని లాల్‌బంగ్లా సమీపంలో నివాసముంటున్న ప్రముఖు వైద్యుడు శ్రీనివాసరెడ్డి ఇంటికి గురువారం మధ్యాహ్నం ఓ దుండగుడు బురఖా ధరించి, హెల్మెట్, చేతులకు గ్లౌజ్‌లు ధరించి స్కూటీపై వచ్చాడు. మొదటి అంతస్తులోకి వెళ్లి శ్రీనివాసరెడ్డి భార్య పద్మావతి మెడపై కత్తిపెట్టి బీరువా తాళాలు ఇవ్వాలని బెదిరించాడు. ఆమె భయంతో పెద్దగా కేకలు వేసింది. దీంతో అతడు ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కోని స్కూటీపై పరారయ్యాడు. స్థానిక సాయిబాబా థియేటర్ సమీపంలో ఓ ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీకొట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివశంకర్ తెలిపారు.
బైండోవర్ అతిక్రమించిన
వ్యక్తికి జరిమానా
తిరుమలగిరి(సాగర్) : బైండోవర్ అతిక్రమించిన వ్యక్తికి రూ.లక్ష జరిమానా విధించగా గురువారం తహసీల్దార్ కార్యాలయంలో జరిమానా చెల్లించాడు. ఎస్‌ఐ వీరశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రానికి చెందిన ఈరబోయిన రాజు గతంలో ఓ మహిళను వేధించిన కేసులో నేరస్తుడిగా ఉండగా.. అతడిని తహసీల్దార్ వద్ద బైండోవర్ చేశారు. కానీ అతడు బైండోవర్ అతిక్రమించి మరో కేసులో కల్గజేసుకోవడంతో రూ.లక్ష జరిమానా చెల్లించాలని లేదా ఏడాది జైలుశిక్ష అనుభవించాల్సిందిగా తహసీల్దార్ పేర్కొన్నారు. దీంతో రాజు గురువారం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సమక్షంలో రూ.లక్ష జరిమానా చెల్లించాడు.
వడదెబ్బతో మహిళకు
తీవ్ర అస్వస్థత
నకిరేకల్ : వడదెబ్బ తగిలి మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ ఘటన నకిరేకల్ మండలం చందంపల్లి ఫ్లైఓవర్ వంతెన వద్ద గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం సాయంత్రం 65 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని మహిళ చందంపల్లి ఫ్లైఓవర్‌వద్ద వడదెబ్బ తగిలి కళ్లు తిరిగి పడిపోయింది. స్థానికులు గమనించి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చి స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహిళ గురించి తెలిసిన వారు నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ హరిబాబు సూచించారు.


