హుజూర్‌నగర్ : ప్రమాదవశాత్తు మంటలంటుకుని గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ ఘటన హుజూర్‌నగర్ మండలం వేపల సింగారం గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేపల సింగారం గ్రామానికి చెందిన రైతు నర్సింగ్ నారాయణ తన పశువుల మేత కోసం గడ్డివాములు ఏర్పాటు చేసుకున్నాడు. గురువారం మధ్యాహ్నం ఆ గడ్డివాములకు మంటలు అంటుకోవడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చేలోపు మంటలు వేగంగా వ్యాపించి చాలా వరకు గడ్డి కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ సగానికి పైగా గడ్డి మోపులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.90 వేల విలువైన గడ్డి కాలిబూడిదైందని బాధిత రైతు వాపోయాడు. అధికారులు స్పందించి తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.


