వేసవి దుక్కులతో ఎన్నో లాభాలు | - | Sakshi
Sakshi News home page

వేసవి దుక్కులతో ఎన్నో లాభాలు

Apr 21 2026 6:19 AM | Updated on Apr 21 2026 6:19 AM

వేసవి దుక్కులతో ఎన్నో లాభాలు

పెన్‌పహాడ్‌ : వేసవి దుక్కులు దున్నడంతో అనేక ప్రయోజనాలుంటాయి. పంటల ఉత్పత్తి పెరగడంతోపాటు చీడపీడల బెడద ఉండదు. అంతేకాకుండా లోతు దుక్కులతో వర్షపు నీరు భూమి లోతుల్లోకి వెళ్లి పంటలకు ఉపయోగకరంగా ఉంటుంది. రైతులు ముందస్తు ప్రణాళికతో సాగుచేస్తే అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. వేసవిలో భూములను లోతులతో పంటలను నాశనం చేసే క్రిమికీటకాలు చనిపోతాయి. వానాకాలం సీజన్‌ ప్రారంభానికి రెండు నెలల ముందు నుంచే వేసవి దుక్కులు దున్నుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పెన్‌పహాడ్‌ మండల వ్యవసాయ అధికారి అనిల్‌కుమార్‌ అంటున్నారు. భూసారం పెంపుకోసం వేసవిలో చేపట్టాల్సిన పనులపై రైతులకు ఆయన ఇచ్చే సూచనలు.

లోతు దుక్కులతో ప్రయోజనం ఇలా..

● లోతు దుక్కులు దున్నడం చాలా ఉపయోగం. 35–40 సెంటీమీటర్ల లోతుగా దుక్కి చేయడంతో భూమిలో గట్టిపొర పగిలి నేల బాగా గుల్లబారుతుంది.

● వర్షపు నీరు భూమిలోకి

ఇంకుతుంది.

● ఇంకిన నీరు భూమిలో నిలువ ఉండడంతో పంట వేర్లు లోపలి పొరల్లో పెరిగి ఎక్కువ నీటిని, పోషక పదార్థాలను గ్రహించడానికి వీలవుతుంది.

● లోతుగా దున్నిన దుక్కి ప్రభావం 2–3 సంవత్సరాల వరకు ఉండడంతో పంటల దిగుబడులకు భూములు అనుకూలంగా ఉంటాయి.

● వేసవిలో లోతుగా దుక్కి దున్ని తొలకరి వర్షాలకు సేద్యం చేస్తే వేర్లు బాగా విస్తరించడానికి నేల అనుకూలంగా ఉంటుంది.

● పంటకోత తర్వాత నేలపై మిగిలే పంట మొదళ్లు పొలంలో మిగిలిన కలుపు మొక్కలు, పంటల నుంచి రాలిపడిన ఆకులు వంటి వివిధ సేంద్రియ పదార్థాలన్ని లోతు – దుక్కి దున్నిన్నప్పుడు నేలలో కలిసి కుళ్లిపోతాయి. దీంతో నేలసారం పెరుగుతుంది.

పశువుల మంద కడితే

చాలా మేలు..

గతంలో ప్రతి రైతు ఎద్దులు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలను రాత్రిళ్లు పొలంలో కట్టేసేవారు. అయితే వాటి మలమూత్రాలు పొలానికి చేరి పంటలకు ఉపయోగపడేవి. దీంతో ఎరువులు ఖర్చు తగ్గేది. ఇప్పుడు పశువుల పెంపకాలు తగ్గిపోయాయి. పశుగణం ఎక్కువగా ఉంటే గ్రామాల్లో ఈ పని ఇప్పటికై నా చేయొచ్చు. పశువుల ఎరువు అందించడంతో ఉత్పత్తులను లాభాసాటిగా సాధించవచ్చు. మొండిజాతి కలుపు నివారణ, తుంగ, గరిక వంటి మొండిజాతి కలుపు మొక్క పొలంలో పెరిగి పంటలకు నష్టం కలుగజేస్తుంటాయి. వీటితో వేర్లు, కాయలు, దుబ్బలు నేలలో బాగా విస్తరించి ఉండడంలో నివారణ కష్టం అవుతుంది. పశువుల ఎరువు ఉపయోగించడం వల్ల పంటలు ఏపుగా పెరిగి కలుపు మొక్కలు అంతగా పెరిగే అవకాశం ఉండదు.

ఫ పంటకు హానిచేసే కీటకాల నివారణ

ఫ వర్షపు నీరు లోతుకు చేరే అవకాశం

ఫ పెన్‌పహాడ్‌ వ్యవసాయాధికారి

అనిల్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement