సూర్యాపేటటౌన్ : సూర్యాపేట పట్టణంలోని జేజేనగర్‌లో ఈ నెల 18న ఇరుగు పాపమ్మ (80) అనే వృద్ధురాలిని హత్య చేసి బంగారు దోచుకెళ్లిన నిందితుడిని ఏపీలోని ఏలూరులో అరెస్టు చేసి తీసుకొస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన శివకోటి సైదులాచారి(46) సంవత్సర కాలంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జేజేనగర్‌లో కుటుంబంతో ఉంటున్నాడు. సెంట్రింగ్ పని చేస్తుంటాడు. సైదులాచారికి ఇద్దరు కుమారులు కాగా.. ఒక కుమారుడు మిర్యాలగూడలో ఉంటుండగా మరో కుమారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు సమీపంలో గాయాలగూడెంలో ఉంటున్నాడు. సైదులాచారి భార్య మూడు నెలల క్రితం అతనితో గొడవపడి వెళ్లిపోయింది.
వృద్ధురాలిని హత్య చేసి
బంగారం దోచుకెళ్లాడు..
మద్యానికి బానిసైన సైదులాచారి.. తను ఉండే అద్దె ఇంటి సమీపంలో వృద్ధురాలైన పాపమ్మ వద్ద బంగారం ఉన్న విషయాన్ని కనిపెట్టి ఆమె బంగారాన్ని దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 18న శనివారం మధ్యాహ్నం సమయంలో పాపమ్మ ఇంట్లో ఒక్కతే ఉన్న విషయాన్ని కనిపెట్టి ఇంట్లోకి ప్రవేశించి పాపమ్మను హత్య చేసి ఆమె వద్ద ఉన్న నల్లపూసల గొలుసు, దిద్దులు, మాటీలు మొత్తం మూడు తులాల బంగారాన్ని దోచుకుని తన సొంతూరైన మిర్యాలగూడకు వెళ్లి అక్కడ ఓ ఫైనాన్స్ కంపెనీలో బంగారాన్ని కుదవపెట్టాడు. అక్కడి నుంచి తన కుమారుడు ఉంటున్న ఏలూరుకు వెళ్లాడు. వృద్ధురాలి హత్య, బంగారం చోరీపై దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడు ఏలూరులో ఉన్నట్లు తెలుసుకుని ఆదివారం అక్కడికి వెళ్లారు. విచారణ కోసం పోలీస్ ప్రత్యేక బృందం నిందితుడు సైదులాచారిని అరెస్టు చేసి సూర్యాపేటకు తీసుకొస్తుండగా.. ఆదివారం రాత్రి కోదాడ సమీపంలోకి రాగా సైదులాచారి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే పోలీసులు కోదాడలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
గుండెపోటుతోనే నిందితుడు మృతిచెందాడు
వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడిని సూర్యాపేట పోలీసులు ఏలూరు నుంచి తీసుకొస్తుండగా కోదాడ సమీపంలో గుండెపోటుతో మృతి చెందినట్టు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వృద్ధురాలిని హత్య చేసిన అనంతరం సైదులాచారి మిర్యాలగూడకు వెళ్లి అతని బావమరిది ఆనంద్ సహాయంతో బంగారాన్ని ఐఏఎఫ్‌ఎల్ ఫైనాన్స్ సంస్థలో కుదవపెట్టి రూ.1,44,900 తీసుకున్నట్టు తెలిపారు. ఆ డబ్బులో కొంత ఖర్చు చేసి అక్కడి నుంచి తన చిన్న కుమారుడు ఉంటున్న ఏలూరులోని గాయాలగూడెంకు వెళ్లినట్టు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా సూర్యాపేటలో వృద్ధురాలిని హత్య చేసి దొంగతనం చేసినట్టు తెలుసుకున్న ఆనంద్.. వెంటనే సూర్యాపేట పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం మేరకు సూర్యాపేట పోలీసులు ఆదివారం ఏలూరుకు వెళ్లి అక్కడ నిందితుడిని పట్టుకొని అతడి కుమారుడిలో సమక్షంలో విచారించగా దొంగతనం ఒప్పుకున్నట్టు ఎస్పీ చెప్పారు. దీంతో అక్కడి నుంచి సూర్యాపేటకు విచారణ నిమిత్తం తీసుకొస్తుండగా కోదాడ సమీపంలోకి రాగానే ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో సైదులాచారి అస్వస్థతకు గురి కాగా వెంటనే పోలీసులు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించినట్టు చెప్పారు. నిందితుడికి గతంలో బైపాస్ సర్జరీ జరిగిందని, మరోసారి గుండెపోటు రావడంతో మృతిచెందినట్టు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
వృద్ధురాలి హత్య కేసులో ఏలూరులో నిందితుడి అరెస్టు
రాత్రి కోదాడ సమీపంలోకి రాగానే
సైదులాచారికి అస్వస్థత
గుండెపోటుతో మృతిచెందినట్లు
ఎస్పీ నరసింహ వెల్లడి


