చిట్యాల : భార్యభర్తల మధ్య నెలకొన్న గొడవలతో మనస్థాపానికి గురైన భర్త గడ్డిమందు తాగి ఆదివారం మృతిచెందగా సోమవారం కేసు నమోదు చేసినట్లు చిట్యాల ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా మునగాలకు చెందిన పనస కృష్ణ(52) తన భార్య నీలమ్మతో కలిసి రెండేళ్లుగా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని యర్రమాద రమణారెడ్డికి చెందిన మామిడి తోటలో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో కృష్ణ మద్యం ఎక్కువగా సేవిస్తూ వస్తుండడంతో అతని భార్య నీలమ్మతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. కాగా ఈనెల 18న భార్యభర్తల మద్య గొడవ జరిగి నీలమ్మ తన అమ్మగారి ఇంటికి వెళ్లింది. దీంతో మనస్థాపానికి గురైన కృష్ణ ఆదివారం ఉదయం గడ్డి మందు తాగాడు. గుర్తించిన స్థానికులు అతన్ని వెంటనే నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదేరోజు రాత్రి మృతి చెందాడు. దీంతో మృతుడి అన్న వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తికి గాయాలు
భూదాన్‌పోచంపల్లి : భూదాన్‌పోచంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బోడ సత్యనారాయణ అనే వ్యక్తి గాయపడ్డాడు. సోమవారం ఉదయం ఆసుపత్రి సమీపంలో మెయిన్ రోడ్డు వద్ద బైక్‌ను యూటర్న్ తీసుకొంటున్న క్రమంలో డివైడర్ మధ్యన ఏపుగా పెరిగిన మొక్కల వల్ల కన్పించక పద్మానగర్ నుంచి వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై నుంచి సత్యనారాయణ కింద పడడంతో కాళ్లు, కణత భాగంలో గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు హైదారాబాద్‌కు తరలించారు. మెయిన్ రోడ్డులోని యూటర్న్‌ల వద్ద ప్రమాదాలకు కారణమవుతున్న డివైడర్‌ల మధ్యన పెరిగిన మొక్కలను కట్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.
‘ప్రీమియర్’లో అగ్ని ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలోని ప్రీమియర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, కంపెనీ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద కంకూరు గ్రామానికి చెందిన మిరియాల క్రాంతికుమార్ అనే వ్యక్తి ఉదయం షిఫ్ట్‌లో సీ 11 ఎల్ 3 బ్లాక్‌లో రోజువారిగానే తమ విధులు నిర్వహిస్తున్నాడు. ప్రొడక్షన్‌కు సంబంధించిన రా మెటీరియల్ కెమికల్‌ను షిఫ్ట్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో క్రాంతికుమార్ అనే వ్యక్తి చేతికి, మొహానికి మంటలు అంటుకొని గాయాలయ్యాయి. తనతోపాటు పనిచేస్తున్న తోటి కార్మికుడు ఎల్లయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన ఇతర కార్మికులు, కంపెనీ అధికారులు మంటలను ఆర్పి గాయాలైన వారిని హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాదం ఎలా జరిగిందని పరిశ్రమ అధికారిని వివరణ అడగగా.. ఎక్స్‌ప్లోజివ్ పరిశ్రమలో ఏమి జరుగుతుందో తెలియదని సమాధానం ఇచ్చారు.


