సూర్యాపేట టౌన్ : గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ నరసింహ వెల్లడించారు. ఆత్మకూరు(ఎస్) గ్రామ శివారులో క్రషర్ మిల్లు వద్ద నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని సమాచారం రాగా వెంటనే ఆత్మకూరు పోలీసులు అక్కడికి చేరుకుని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి నెమ్మికల్‌కు చెందిన వీరబోయిన భరత్ జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామానికి చెందిన ఆరె విజయ్, సూర్యాపేట మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన చెవుల మనోజ్, అలాగే నెమ్మికల్ గ్రామానికి చెందిన కొడిదల శివలుగా గుర్తించారు. వీరిని తనిఖీ చేయగా వారి వద్ద 5 కిలోల గంజాయి, కారు, బైక్, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు జలసాలకు, విలాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచనతో గంజాయి వినియోగించే అలవాటు ఉండడంతో గంజాయిని తెచ్చి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం భరత్, విజయ్, మనోజ్ ముగ్గురు కలిసి కొడిదల శివకు చెందిన మోటార్ సైకిల్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్లి సీలేరు ఏరియాలో గంజాయిని కొనుగోలు చేసి తెచ్చారు. ఈ గంజాయిని పంచుకోవడం కోసం నలుగురు ఆత్మకూరు(ఎస్) గ్రామ శివారు క్రషర్ మిల్ వద్దకు రాగా సమాచారం అందుకున్న మండల పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు శ్రమించిన సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్, ఆత్మకూరు ఎస్‌ఐ శ్రీకాంత్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు.
నిందితుల నుంచి ఐదుకిలోల
గంజాయి స్వాధీనం
కేసు వివరాలు వెల్లడించిన
ఎస్పీ నరసింహ


