చేనేత సంఘాల్లో సభ్యత్వాల లొల్లి | - | Sakshi
Sakshi News home page

చేనేత సంఘాల్లో సభ్యత్వాల లొల్లి

Apr 21 2026 3:44 AM | Updated on Apr 21 2026 3:44 AM

ఆదరాబాదరాగా కొత్త సభ్యత్వాలు

అనర్హులు ఉంటే తొలగిస్తాం

మగ్గం నేసే వారికి మొండిచేయి

అనర్హులకు చోటు

సహకార ఎన్నికల వేళ అధికారులకు కార్మికుల ఫిర్యాదులు

జిల్లాలో 58 సంఘాలు

సాక్షి, యాదాద్రి: చేనేత సహకార సంఘాల్లో సభ్యత్వాల లొల్లి ముదురుతోంది. దశాబ్దాలుగా మగ్గాన్ని నమ్ముకుని జీవిస్తున్న నేతన్నలకు సభ్యత్వం దక్కడం లేదు. కానీ, మగ్గం ముట్టని వారికి మాత్రం సభ్యత్వాలు కట్టబెడుతున్నారు. చేనేత సంఘాల ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో తమ అధికారాన్ని కాపాడుకునేందుకు కొందరు పాలకవర్గ నేతలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. జనరల్‌ బాడీ ఆమోదం లేకుండా, ఏడీ అనుమతి రాకుండానే కొత్త సభ్యత్వాల పేరిట తమ అనుయాయులను చేర్చుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులైన తమకు న్యాయం చేయాలంటూ నేతన్నలు కలెక్టరేట్‌ మెట్లెక్కుతున్నారు.

ఫిర్యాదుల పరంపర

ప్రభుత్వం చేనేత సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఈనేపథ్యంలో ఓటరు జాబితాలను ప్రకటించారు. జాబితాలపై ఈనెల 18 నుంచి 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. రామన్నపేట మండలం సిరిపురం, వెల్లంకి, భువనగిరి చేనేత సహకార సంఘాల తీరుపై స్థానిక కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సభ్యుల జాబితాలో 18 ఏళ్ల లోపు వారు, అర్హత లేని వారు ఉన్నారని, కొన్ని సంఘాల్లో మరణించిన వారి వారసులకు సభ్యత్వాలు ఇవ్వడం లేదని కార్మికులు అదనపు కలెక్టర్‌, ఏడీ చేనేత జౌళి శాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. వివాహమై ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి సభ్యత్వాలను నిబంధనల ప్రకారం తొలగించపోవడంతో ఇతర ప్రాంతాలకు మార్పులు చేయకపోవడంతో సాధారణ కార్మికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, శిక్షణా కార్యక్రమాలను కోల్పోతున్నారని వివరించారు. ఈ ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపించాలని కోరిన వారిలో నాగరాజు, పున్న వెంకటేశం, రాపోలు ప్రభాకర్‌, భారత మత్యుంజయ, గంజి శ్రీనివాస్‌, ముడుదుడ్ల రమేష్‌, కడవేరు శ్రీనివాస్‌, సంగిశెట్టి గణేష్‌, పొట్టబత్తుల వెంకటేష్‌ తదితరులు ఉన్నారు.

9 సంఘాలకు క్యాష్‌ క్రెడిట్‌

జిల్లాలో 58 సహకార సంఘాలుండగా ఇందులో 13,550 మంది వరకు సభ్వత్వం కలిగి ఉన్నారు. ఇందులో 16 సిల్క్‌, 28 కాటన్‌, నాలుగు పవర్‌ లూమ్‌ సంఘాలు ఉండగా ప్రస్తుతం జిల్లాలో 9 సంఘాలకు మాత్రమే క్యాష్‌ క్రెడిట్‌ వచ్చింది. పలు సంఘాల దివాళా తీశాయి. మరికొన్ని సంఘాలకు ఏళ్లుగా ఆడిట్‌ కూడా చేయించలేదు. అలంకారప్రాయంగా మారిన సంఘాల్లో పదవులపై కన్నేసిన కొందరు హడావుడి చేస్తున్నారు. కాగా జిల్లాలో చేనేత సహకార సంఘాలది ఘనమైనచరిత్ర. ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 1950లోనే చౌటుప్పల్‌ మండలం కొయ్యల గూడెం సహకారం సంఘంలో సభ్యత్వం కలిగి ఉన్నారు.

ప్రస్తుతం చేనేత సహకార సంఘాల్లో ఉన్న పర్సన్‌ ఇన్‌చార్జ్‌ పాలకవర్గాలు కొత్తగా సభ్యత్వాలు కల్పిస్తున్నారు. తమ పదవీ కాలం ముగుస్తుండగా తమ అనుయాయులకు సభ్వత్వాలు ఇస్తున్నారు. అయితే కొత్తగా సభ్యత్వాలు ఇవ్వాలంటే జనరల్‌ బాడీలో ఆమోదించిన తర్వాత ఏడీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే జనరల్‌ బాడీలో ఆమోదం పొందుతున్న సభ్వత్వాలు ఏడీ వద్ద విచారణలో ఉన్నాయి. ప్రస్తుతం ఇస్తున్న కొత్త సభ్వత్వాల్లో చనిపోయిన పాత సభ్యుల వారసులకు ఇస్తున్న సభ్వత్వాలుకూడా వివా దాస్పదం అవుతున్నాయి. పోచంపల్లి, సిరిపురం వెల్లంకిలో వారసులకు ఇచ్చిన సభ్యత్వాలపై జిల్లా జౌళి శాఖ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కొత్తగా ఇస్తున్న సభ్యత్వాల పై అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఇప్పటికిప్పుడు నూతనంగా సభ్యత్వం ఇచ్చినా ఓటుహక్కువచ్చే వీలు లేదు. 2026 మార్చి 31 నాటికి 365 రోజుల ముందు, అంటే ఏడాది ముందు సభ్యత్వం కలిగి ఉండాలి. ఇందుకోసం జనరల్‌ బాడీ సమావేశంలో సభ్యత్వం కోసం వాటా ధనం జమ చేసి ఉండాలి. చేనేతసహకార సంఘాల్లో సభ్వత్వాలపై ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై విచారిస్తున్నాం.

– శ్రీనివాసరావు, ఏడీ చేనేత జౌళి శాఖ

Advertisement
 
Advertisement
Advertisement