సాక్షి, యాదాద్రి : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం కింద మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, వెంకారెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఎస్‌ఐఆర్‌పై సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు పాల్గొని మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి ,భువనగిరి తహసీల్దార్ జగన్మోహన్ ప్రసాద్ , ఎలక్షన్‌సెల్ సూపరింటెండెంట్ కృష్ణ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
22 వరకు పాలిసెట్‌కు దరఖాస్తులు
యాదగిరిగుట్ట: ఈ నెల 22వ తేదీ వరకు పాలిసెట్‌కు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించాలని సూచించారు. అంతే కాకుండా యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఫ్రీ పాలిసెట్ కోచింగ్ సైతం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
భువనగిరి: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం పొడిగించినట్లు డీఐఈవో రమణి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 20తో ముగిసిందని దీనిని ఈ నెల 23 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జనరల్, ఒకేషనల్ స్ట్రీమ్ విద్యార్థులకు ఇది వర్తిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కీటక జనిత వ్యాధులను అరికట్టాలి
భువనగిరి: వివిధ శాఖలు సమన్వయంతోపని చేసి కీటక జనిత వ్యాధులను అరికట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మనోహర్ సూచించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నీటి నిల్వలు, మురుగు నీటి కాల్వల్లో నీరు నిల్వ ఉండా చూసుకోవాలని ఆదేశించారు. నీరునిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందుతాయన్నారు. దీంతో వ్యాధుల బారినపడతారని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్‌డీవో నాగిరెడ్డి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు వంశీకృష్ణ, రామకృష్ణ, వీణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరి: భువనగిరి పట్టణంలోని కేంద్రీయ విద్యాయంలో 2026–27 విద్యా సంవత్సరానికి 11వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ చంద్రమౌళి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులు అందుబాటులోఉన్నట్లు వివరించారు. ప్రతి కోర్సులో 40 సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. సీబీఎస్‌ఈ విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.అర్హత కలిగిన విద్యార్థులు మే 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 08685–295500 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.


