భూముల అన్యాక్రాంతంపై విచారణ చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూముల అన్యాక్రాంతంపై విచారణ చేయాలి

Apr 21 2026 3:44 AM | Updated on Apr 21 2026 3:44 AM

భువనగిరిటౌన్‌ : ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై విచారణ చేయాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, కర్రె వెంకటయ్య డిమాండ్‌చేశారు.యాదగిరిగుట్ట, రాజాపేట మండలాల్లో భూ కబ్జాలు, అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా సోమవారం బీఆర్‌ఎస్‌ నాయకులు కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. వినతి పత్రం అందజేసేందుకు వెళ్తున్న నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో అధికారుల చాంబర్‌ వద్ద తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నాయకులు లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగింది. అనంతరం అదనపు కలెక్టర్‌ను నాయకులు కలిశారు. రాజకీయ పలుకుబడితో జరుగుతున్న ఈ భూకబ్జాలపై విచారణ జరిపి భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 726లో గల విలువైన ప్రభుత్వ భూమిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమించి వెంచర్లుగా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాపేట మండలం చల్లూరు గుట్టల్లోని సర్వే నంబర్‌ 322లో సాగుతున్న అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేశారు. ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా భారీ బ్లాస్టింగ్‌లు నిర్వహిస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారని, దీనివల్ల స్థానిక గ్రామ ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని, అక్రమ మైనింగ్‌పై తక్షణమే చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చామకూర గోపాల్‌ గౌడ్‌, నాయకులు గంగుల శ్రీనివాస్‌ ,బొట్ల యాదయ్య, మధుసూదన్‌ రెడ్డి ఖలీల్‌, నరేందర్‌రెడ్డి, సట్టు తిరుమలేశ్‌, ఇమ్మడి రాంరెడ్డి,పుట్ట మల్లేష్‌ గౌడ్‌ , ఆడెపు బాల స్వామి,పలుగుల నవీన్‌, సర్పంచులు తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement