బ్రహ్మోత్సవాల్లో అవకాశం కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాల్లో అవకాశం కల్పించాలి

Apr 20 2026 9:29 AM | Updated on Apr 20 2026 9:29 AM

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చేందుకు స్థానిక తెలంగాణ ప్రజా నాట్యమండలి కళాకారులకు అవకాశం కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌ రెడ్డి కోరారు. ఈమేరకు ఆదివారం ఆలయ ఈఓ భవాని శంకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా నాట్యమండలి కళాకారులు సమాజ సమస్యలను ప్రతిబింబిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారని తెలిపారు. అలాంటి కళాకారులకు బ్రహ్మోత్సవాల వంటి వేదికల్లో ప్రదర్శనలకు అవకాశం కల్పించడం ద్వారా సంప్రదాయ కళలకు ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన ఈఓ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందించిన వారిలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, చెక్క వెంకటేష్‌, ఎండీ ఇమ్రాన్‌, పేరబోయిన మహేందర్‌, మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్‌ తదితరులున్నారు.

యాదగిరీశుడి ఆలయంలో సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ముఖ మండపంలోని ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజను విశేషంగా నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు చేశారు. సాయంత్రం వేళ ఆలయంలో జోడు సేవను ఊరేగించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.

రిజర్వేషన్లు కల్పించాలి

మోతె : జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించినప్పుడే దళిత వర్గాలకు న్యాయం జరుగుతుందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కాసీం అన్నారు. ఆదివారం మోతె మండలం రావిపహాడ్‌ గ్రామంలో ఏబీఆర్‌ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగ ఫలాలు జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, బీసీలకు అందించాలన్నారు. విద్యకు అధిక బడ్జెట్‌ను కేటాయించి అందరికి ఉచిత, నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. నేడు తెలంగాణలో ఎస్సీ మాదిగ కులస్తులు 40 నుంచి 50 లక్షల మంది ఉన్నారని, 80 ఏళ్ల నుంచి దళితుల పరిస్థితి హీనంగా ఉందని పేర్కొన్నారు. తళితులు మతం మారినంత మాత్రాన రిజర్వేషన్లు తొలగిస్తామనడం సబబు కాదన్నారు. దళితులు విద్యతోనే చైతన్యవంతులు కావాలని, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అనంతరం ఏపూరి సోమన్న కళా బృందంతో ఆటా, పాటా కార్యక్రమం నిర్వహించారు. ఏబీఆర్‌ యువజన సంఘం అధ్యక్షుడు కాంపాటి దిలీప్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కోడి లింగయ్య, నాయకులు పొడపంగి యలమంచి, పొడపంగి ముత్తయ్య, బక్కమ్మ కిష్టయ్య, శ్యామలేటి కోటేష్‌, ఏబీఆర్‌ యువజన సంఘం ఉపాధ్యక్షుడు తిర్పయ్య, ప్రధాన కార్యదర్శి చాట్ల ప్రభంజన్‌, కోషాధికారి వీమళ్ల రాము కాశీం, వి.గుర్వయ్య, పి. రమేష్‌, కాంపాటి వెంకన్న, యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement