భువనగిరిటౌన్ : పట్టణాల సమగ్ర అభివృద్ధికి కీలకమైన ఆస్తిపన్ను వసూళ్లపై మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం ప్రకటించిన 5 శాతం రాయితీ గడువు ఈనెల 30వ తేదీతో ముగియనుంది. ఆరు మున్సిపాలిటీలు కలుపుకుని ఆస్తిపన్ను డిమాండ్ రూ.16.35కోట్లు ఉండగా.. ఇప్పటివరకు రూ. 2.39 కోట్లకు పైగా పన్నులు వసూలయ్యాయి. భువనగిరి మున్సిపాలిటీలో డిమాండ్ రూ.5కోట్ల84లక్షలు ఉండగా ఇప్పటివరకు రూ.64లక్షల 28వేలు వసూలయ్యాయి. ఇక చౌటుప్పల్ మున్సిపాలిటీలో రూ.5కోట్ల68లక్షలకు రూ.కోటి 37లక్షలు, ఆలేరులో రూ.38లక్షలకు రూ.12లక్షలు, మోత్కూరులో రూ.36లక్షలకు రూ.10లక్షలు, పోచంపల్లిలో రూ.3కోట్ల39లక్షలకు రూ.10లక్షలు, యాదగిరిగుట్టలో రూ.70లక్షలకు రూ.14లక్షలు వసూలు చేశారు.
ముమ్మరంగా క్షేత్రస్థాయి ప్రచారం
గడువు సమీపిస్తున్న తరుణంలో మున్సిపల్ కమిషనర్లు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పిస్తున్నారు. మైకుల ద్వారా ప్రచారం చేస్తూ, బకాయిలు లేని వారు ఈ నెలలో పన్ను చెల్లిస్తే లభించే ఆర్థిక ప్రయోజనాన్ని వివరిస్తున్నారు.
ఆన్‌లైన్ చెల్లింపులకే మొగ్గు
కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా చాలామంది పౌరులు సీడీఎంఏ పోర్టల్ ద్వారా లేదా మొబైల్ యాప్‌ల ద్వారా ఆనన్‌లైన్‌లో చెల్లించే అవకాశం కల్పించారు. డిజిటల్ చెల్లింపుల వల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, తక్షణమే రశీదు పొందే వీలుండటంతో విద్యావంతులు, వ్యాపారవేత్తలు దీనికే మొగ్గు చూపుతున్నారు.
అధికారుల విజ్ఞప్తి
పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ వంటి పనులు ప్రజలు చెల్లించే పన్నులపైనే ఆధారపడి ఉంటాయి. 5 శాతం రాయితీ అనేది పన్ను చెల్లింపుదారులకు ఒక మంచి అవకాశం. ఈనెల 31వ తేదీ లోపు ఆస్తిపన్ను చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ అధికారులు కోరుతున్నారు.
ఫ మున్సిపాలిటీల్లో పన్ను చెల్లింపుదారులకు ఎర్లీబర్డ్ ఊరట
ఫ ఈ నెలాఖరుతో ముగియనున్న పథకం
ఫ డిమాండ్ రూ.16.35కోట్లు
ఫ ఇప్పటివరకు వసూలైంది రూ.2.48కోట్లు
ఫ లక్ష్య సాధనలో అధికారులు నిమగ్నం
మున్సిపాలిటీల వారీగా పన్నుల వివరాలు
డిమాండ్ వసూలైంది (రూ.ల్లో)
భువనగిరి 5.84 కోట్లు 64.28 లక్షలు
చౌటుప్పల్ 5.68 కోట్లు 1.37 కోట్లు
పోచంపల్లి 3.39కోట్లు 10 లక్షలు
యాదగిరిగుట్ట 70లక్షలు 14లక్షలు
ఆలేరు 38 లక్షలు 12లక్షలు
మోత్కూరు 36.21 లక్షలు 10.77 లక్షలు


