అధిక వడ్డీ ఆశతో మోసపోయిన బాధితులు | - | Sakshi
Sakshi News home page

అధిక వడ్డీ ఆశతో మోసపోయిన బాధితులు

Apr 20 2026 7:12 AM | Updated on Apr 20 2026 7:12 AM

కొండమల్లేపల్లి : అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజల నుంచి రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసిన వ్యక్తి రెండు రోజుల క్రితం మృతిచెందగా.. అప్పు ఇచ్చిన బాధితులు ఎటూ పాలుపోని స్థితిలో ఉండిపోయారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకల గ్రామానికి చెందిన వరికుప్పల శేఖర్‌ కొండమల్లేపల్లి మండల కేంద్రం సమీపంలోని దోనియాల గ్రామ శివారులో ఇల్లు నిర్మించుకొని కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. తన ఇంటికి సమీపంలోనే ఇస్తరాకులు తయారుచేసే కంపెనీని ఏర్పాటుచేసి వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఆరేళ్ల నుండి అధిక వడ్డీ ఇస్తానని చెప్పి సన్నిహితులు, బంధువులు, స్నేహితుల నుంచి డబ్బులు తీసుకున్నాడు. మొదట్లో అప్పు ఇచ్చిన వారికి వడ్డీలు బాగానే కట్టి నమ్మకం పెంచుకున్నాడు. దీంతో అమాయక ప్రజలు బయట రూ.2 వడ్డీకి బయట అప్పులు తెచ్చి శేఖర్‌కు అధిక వడ్డీకి ఇచ్చారు. ఈవిధంగా శేఖర్‌ సుమారు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం

ఏడాది నుంచి ఇబ్బందులు..

అయితే శేఖర్‌ గత ఏడాది నుంచి అప్పులు ఇచ్చిన వారికి సక్రమంగా వడ్డీలు ఇవ్వడం లేదు. అంతేకాకుండా మూడు నెలల క్రితం శేఖర్‌ గుండెకు స్టంట్‌ వేసినట్లు అతడి ఇంటి చుట్టుపక్కల వారి ద్వారా తెలిసింది. అప్పు ఇచ్చిన వారి నుంచి శేఖర్‌పై ఒత్తిడి పెరగడంతో డబ్బులు తెస్తానని కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్లి రెండు రోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందాడు. అతని బంధువులు బెంగళూరుకు వెళ్లి శేఖర్‌ మృతదేహాన్ని ఆదివారం ఉదయం కొండమల్లేపల్లికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో శేఖర్‌కు అప్పులిచ్చిన బాధితులంతా అతడి ఇంటి వద్దకు చేరుకొని ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. బాధితులు 50 మంది కంటే ఎక్కువే ఉన్నట్లు సమాచారం. ఇటీవల పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పడమటితండాకు చెందిన బాలాజీనాయక్‌, మధునాయక్‌ అధిక వడ్డీ ఆశచూపి ప్రజలను మోసం చేసిన ఘటన మరువక ముందే కొండమల్లేపల్లిలో ఇలాంటి ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు అవాక్కయ్యారు.

బెంగళూరులో ఎవరున్నారు..?

బెంగళూరులో శేఖర్‌ ఎవరితోనైనా వ్యాపారం చేసి మోసపోయాడా..? అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు అనేది శేఖర్‌ కుటుంబ సభ్యులు, అతని సన్నిహితులకు మాత్రమే తెలియాలి. అప్పులిచ్చిన బాధితులు ఆదివారం ఉదయం మృతుడి ఇంటి ముందు చర్చించుకునే సందర్భంలో ముగ్గురు వ్యక్తుల పేర్లు బలంగా వినిపించాయి. వారిలో బద్రినాథ్‌, జాఫర్‌, ప్రకాష్‌ అనే పేర్లు ప్రత్యేకంగా బాధితులు చర్చించుకోవడం గమనార్హం. ఈ ముగ్గురికి, శేఖర్‌కి సంబంధం ఏమిటి అనేది తెలిస్తే డబ్బుల వ్యవహారం కూడా వెలుగులోకి రావచ్చని బాధితులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై కొండమల్లేపల్లి ఎస్‌ఐ అజ్మీరా రమేష్‌ని సంప్రదించగా అధిక వడ్డీకి సంబంధించి మోసపోయినట్లుగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

అప్పు తీసుకున్న వ్యక్తి

గుండెపోటుతో మృతి

మృతుడి ఇంటి వద్ద ఎటూ పాలుపోని స్థితిలో బాధితులు

Advertisement
 
Advertisement
Advertisement