అన్నదాతలకు తాలు తంటా | - | Sakshi
Sakshi News home page

అన్నదాతలకు తాలు తంటా

Apr 20 2026 7:12 AM | Updated on Apr 20 2026 7:12 AM

నల్లగొండ : జిల్లాలో ధాన్యం దిగుమతుల వ్యవహారం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. యాసంగి ధాన్యంలో తాలు ఎక్కువగా ఉందంటూ మిల్లర్లు కొర్రీలు పెడుతుండటంతో.. లారీలు రోజుల తరబడి మిల్లుల ముందే నిలిచిపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కల్లాల వద్దే తూకం వేసి పంపించినా, మిల్లర్లు మాత్రం దిగుమతి చేసుకునేందుకు నిరాకరిస్తుండటం రైతులు ఆందోళన చెందుతున్నారు.

మిల్లర్ల కొర్రీలు.. పెరిగిన నిరీక్షణ

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ధాన్యాన్ని నాణ్యత పరిశీలించిన తర్వాతే తూకం వేస్తున్నారు. అయితే, ఈ ధాన్యం మిల్లులకు వెళ్లగానే సీన్‌ మారుతోంది. ‘తాలు ఎక్కువగా ఉంది.. మాకు నష్టం వస్తుంది’ అంటూ మిల్లర్లు ధాన్యం దించుకోవడం లేదు. దీంతో కల్లాల నుంచి మిల్లులకు వెళ్లిన లారీలు రోజుల తరబడి రోడ్లపైనే ఉండిపోతున్నాయి. తూర్పార పట్టిన ధాన్యాన్ని మాత్రమే తీసుకుంటామని మిల్లర్లు అంటున్నారు. దీంతో లారీ అద్దెలు భారం కావడంతో పాటు, రైతులకు అకాల వర్షాల భయం పట్టుకుంది.

కొనుగోళ్లలో జాప్యం

మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని నిర్వాహకులు కాంటాలు వేయడం లేదు. అక్కడి నుంచి లారీలు వస్తేనే కాంటా వేసిన ధాన్యం మిల్లులకు పంపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో కల్లాల వద్ద రైతులకు పడిగాపులు తప్పడం లేదు.

బస్తాకు 2 కిలోల తరుగు.. మళ్లీ కోతలు!

తూకం సమయంలోనే అధికారులు, సిబ్బంది బస్తాకు 2 కిలోల పైనే తరుగు పేరుతో అదనంగా తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే భారీగా తరుగు తీసిన తర్వాత కూడా, మిల్లుల వద్ద మళ్లీ తాలు పేరుతో ధాన్యాన్ని తిరస్కరించడం లేదా అదనపు కోతలు పెట్టాలని చూడటంపై రైతులు మండిపడుతున్నారు. మిల్లర్ల ఇష్టారాజ్యంపై అధికారులకు ఫిర్యాదు చేస్తే, ‘మిల్లర్లతో మీరే మాట్లాడుకోండి’ అని సమాధానం ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి, మిల్లుల వద్ద ధాన్యం దిగుమతులు వేగవంతమయ్యేలా చూడాలని కోరుతున్నారు.

రైతులు మిల్లులకు వెళ్లే అవసరం లేదు..

ధాన్యం అమ్మిన తర్వాత రైతులు మిల్లుకు వెళ్లాల్సిన అవసరం లేదని.. ఒకవేళ రైతులను మిల్లులకు పంపిస్తే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని శనివారం నల్లగొండలో పర్యటించిన రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి స్పష్టం చేశారు. మిల్లులకు వచ్చిన ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోవాలని, ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల ప్రమేయం ఉండొద్దని పేర్కొన్నారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. అయినా మిల్లర్లలో మార్పు రావడం లేదు.

ధాన్యంలో తాలు ఎక్కువ వస్తుందని దిగుమతి చేసుకోని మిల్లర్లు

రోజుల తరబడి మిల్లుల వద్దనే నిలిచిపోతున్న లారీలు

కొనుగోలు కేంద్రాల్లో మందకొడిగా కాంటాలు

రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న రైతులు

Advertisement
 
Advertisement
Advertisement