సూర్యాపేటటౌన్ : ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట మండల పరిధిలోని కాసరాబాద్ రోడ్డులో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసరాబాద్ గ్రామానికి చెందిన కొల్లు సందీప్(28) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సూర్యాపేట పట్టణంలో పనులు ముగించుకొని మరో వ్యక్తితో కలిసి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా.. కాసరాబాద్ గ్రామ సపమీంలోకి రాగానే ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సందీప్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం పోలీసులు సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
గంజాయి పట్టివేత..
ఇద్దరు అరెస్ట్
దేవరకొండ : గంజాయి కలిగి ఉన్న ఇద్దరు యువకులను దేవరకొండ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామ సమీపంలోని పల్లీ మిల్లులో బిహార్‌కు చెందిన ఇద్దరు యువకులు పని చేస్తున్నారు. శనివారం వారు దేవరకొండ పట్టణంలోని రహదారి బంగ్లా సమీపంలో గంజాయి తాగేందుకు ప్రయత్నిస్తుండగా స్ధానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి వారిని తనిఖీ చేయగా సుమారు 100 గ్రాముల గంజాయి లభ్యమైంది. వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
నల్లగొండ : వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని పానగల్‌లో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండల పరిధిలోని మాందాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్య(19)కు నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్‌కు చెందిన శివతో ఆరునెలల క్రితం వివాహమైంది. కాగా ఐశ్వర్య శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలు ఐశ్వర్య తల్లిదండ్రులు ఆదివారం నల్లగొండ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వడదెబ్బతో వృద్ధుడు మృతి
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ పట్టణ పరిధిలోని శ్రీనగర్ కాలనీకి చెందిన గడ్డం గురవయ్య(80) వడదెబ్బకు గురై ఆదివారం మృతిచెందాడు. ఎండ వేడిమికి తట్టుకోలేక గత ఐదు రోజులుగా ఆయన అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో తీవ్ర అస్వస్థతకు గురై తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ గురవయ్య మృతదేహాన్ని సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు.


