ప్రకృతిని మైమరిపించే | - | Sakshi
Sakshi News home page

ప్రకృతిని మైమరిపించే

Apr 19 2026 7:17 AM | Updated on Apr 19 2026 7:17 AM

తీరొక్క మొక్కలతో ఇల్లే నందనవనం

ఆకట్టుకుంటున్న తామర పూల కొలను, మోట బావి

గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా వ్యవసాయ పరికరాలు

తన ఆదాయంలో 80 శాతం

పచ్చదనానికి వెచ్చిస్తున్న

నిడమనూరు వాసి

ప్రకృతిపై ప్రేమతో తన ఇంటిని పచ్చని

పొదరిల్లుగా మార్చుకున్నారు నిడమనూరు మండల కేంద్రానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు మేరెడ్డి వెంకట్రాహుల్‌. ఇంటి ఆవరణలో పూలు, పండ్ల మొక్కలతో పాటు వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. అంతేకాకుండా తామర పూల కొలను, మోట బావి, ఎడ్ల బండి

చక్రాలు, నాగలి, డంగు సున్నపురాళ్లతో

అందంగా తీర్చిదిద్దిన బుద్ధుడి విగ్రహం

ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

నిడమనూరు : వ్యవసాయ విద్యలో డిగ్రీ పూర్తిచేసిన వెంకట్రాహుల్‌ నిడమనూరు మండల కేంద్రంలో జాతీయ రహదారి 167 పక్కనే రెండెకరాలకు పైగా విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకున్నారు. తన ఇంటికి చిత్రకూటమి అని పేరు పెట్టుకున్నారు. వ్యవసాయంతో పాటు ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయంలో 80 శాతానికి పైగా తన ఇంట్లో పచ్చదనాన్ని పెంపొందించడానికి వెచ్చిస్తున్నారు. వెంకట్రాహుల్‌ మూడు దశాబ్దాలుగా ఇంట్లో పెంచుతున్న చెట్లు, వివిధ రకాల మొక్కల కారణంగా వేసవిలో సైతం చల్లగా ఉంటుంది. ఆ ఇంట్లోకి ప్రవేశించగానే పచ్చని మొక్కలు స్వాగతం పలుకుతూ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. ఇంటి ఆవరణ మొత్తం తీగజాతి పందిళ్లు, తామరపూల కొలను, రంగురంగుల పూలచెట్లు, చెట్ల మధ్యలో పాత గ్రానైట్‌ రాళ్లతో అందంగా తీర్చిదిద్దిన అరుగులు కనిపిస్తాయి. మోట బావి, విద్యుత్‌ దీపాలు, చెట్ల పొదల్లో బుద్ధుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. మరోవైపు ఆవు, ఇతర గ్రామీణ వస్తువులతో బొమ్మల కొలువు ఉంటుంది. కొబ్బరి చెట్లు, టేకు చెట్లకు తమలపాకుల తీగలు అల్లుకుపోయి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్‌లోని వివిధ నర్సరీల్లో సేకరించిన క్రోటాన్‌, సుగంధ పరిమళాలు అందించే మొక్కలను పెంచుతున్నారు. వెంకట్రాహుల్‌ ఇంటిని మాజీ మంత్రి జానారెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు ప్రశంసించారు.

చిత్రకూటమి పేరే ఎందుకంటే..

రామాయణంలో రాముడు సీతతో అరణ్యవాసంలో ఉండగా చిత్రకూట్‌ పర్వతంపై పదేళ్లకు పైగా నివసిస్తాడు. రాముడు చిత్రకూట్‌ పర్వతంపై పచ్చని చెట్ల మధ్య ఉన్నప్పుడే ఆనందంగా ఉన్నట్లు చెబుతాడని అందుకే తన ఇంటికి చిత్రకూటమిగా నామకరణం చేసినట్లుగా మేరెడ్డి వెంకట్రాహుల్‌ చెబుతున్నారు. ఇంటి పచ్చదనాన్ని తన తండ్రి మేరెడ్డి మట్టారెడ్డి వారసత్వంగా ఇవ్వగా, అదే పచ్చదనాన్ని కొనసాగిస్తూ తన వారసుడు కృష్ణవివేక్‌కు అందిస్తానని వెంకట్రాహుల్‌ చెప్పడం విశేషం.

ఎడ్ల బండి చక్రాలతో అలంకరించిన

ఇంటి ప్రాంగణం

కృష్ణుడి విగ్రహం ఇరువైపులా ఏర్పాటుచేసిన పురాతన డంగు సున్నంరాళ్లు

ఇంటి పరిసరాల్లో ఏపుగా పెరిగిన మొక్కలు

పచ్చని చెట్లతో ఆహ్లాదంగా కనిపిస్తున్న ఇంటి ప్రవేశ ద్వారం

Advertisement
 
Advertisement
Advertisement