మామిడి కోతల్లో జాగ్రత్తలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

మామిడి కోతల్లో జాగ్రత్తలు తప్పనిసరి

Apr 19 2026 7:17 AM | Updated on Apr 19 2026 7:17 AM

పురుగు మందులు పిచికారీ చేయరాదు

నిషేధించిన పురుగు మందులను మామిడి కాయలపై పిచికారీ చేయకూడదు. వీలైనంత వరకు సేంద్రియ పురుగు మందులను మాత్రమే వాడాలి. కోత తర్వాత వచ్చే తెగుళ్ల నివారణకు తోటలో ముందు నుంచే మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. తోటలో కలుపు లేకుండా శుభ్రం చేసుకోవాలి. కాయలు చిన్నసైజులో ఉన్నప్పుడు, తిరిగి కాాయ కోతకు ముందు లీటరు నీటికి ఒక గ్రాము కార్భండిజమ్‌ లేదా థయోఫానేట్‌ మిథైల్‌ కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. కాత దశలో మూడుసార్లు ఇలా పిచికారీ చేస్తే కాయలపై చీడల బెడద తగ్గుతుంది. కాయలు కుళ్లిపోకుండా ఉంటాయి.

పెద్దవూర : ఈ ఏడాది వాతావరణ మార్పులతో మామిడిలో దిగుబడి అంతంతమాత్రంగానే ఉంది. మామిడి కాయలు ఇప్పుడిప్పుడే పక్వానికి వస్తున్నాయి. కోతలు కూడా మొదలవుతున్నాయి. అయితే చేతికందిన కాయలు, పండ్లను సరైన పద్ధతుల్లో నిల్వ, రవాణా చేస్తేనే ఎంతో కొంత లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో మామిడి కోతతో పాటు నిల్వ, రవాణా చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోత సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం చేసినా నష్టం వాటిల్లే అవకాశం ఉందని అనుముల క్లస్టర్‌ ఉద్యానవన అధికారి కొంపెల్లి మురళి పేర్కొన్నారు. కాయలను సరైన పద్ధతిలో కోయకపోవడం, ముదిరిన కాయలతో పాటు ముదరని కాయలను కోయడం, గ్రేడింగ్‌, ప్యాకింగ్‌లో సరైన ప్రమాణాలు పాటించకపోవడం, అపరిశుభ్రత, నిల్వ లోపాల వలన పండ్లు చెడిపోతాయి. సరైన యాజమాన్య పద్ధతులను అనుసరించటం వలన ఈ నష్టాలను తగ్గించుకోవచ్చు. నిల్వ, రవాణా సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే అధిక లాభాలు పొందవచ్చునని ఆయన సూచిస్తున్నారు.

ఎంపికే కీలకం..

తోటల్లో మామిడికాయలను సరైన దశలోనే కోయాలి. కాయలకు భుజాలు ఏర్పడి, తొడిమ వద్ద గుంత ఉండాలి. శ్వేద గ్రంథులు కనిపిస్తుండాలి. కాయ ఆకుపచ్చ రంగు నుంచి బాగా ముదిరిన లేత ఆకుపచ్చరంగు కలిగిన కాయలనే కోతకు ఎంపిక చేసుకోవాలి. వీటిలోనూ బ్రిక్స్‌(చక్కెర శాతం) ఉన్న కాయలనే కోయాలి. బ్రిక్స్‌ మీటర్‌ ద్వారా బ్రిక్స్‌ 10–13 ఉన్న కాయలను కోసుకోవాలి. రిఫ్రాక్టో మీటరును ఉపయోగించి కాయల పరిపక్వ దశను సులభంగా గుర్తించవచ్చు. ఇవి రవాణాకు అనుకూలంగా ఉంటాయి. లోపల కండ లేతపసుపు రంగులో ఉండాలి. కోత ఉదయం 10 గంటల లోపు లేదంటే సాయంత్రం వేళల్లోనే ఉండాలి. పక్వానికి వచ్చిన కాయలను చిక్కాలను ఉపయోగించి నేలపై పడకుండా కోసుకోవాలి. కాయలకు గాయాలైతే మగ్గబెట్టిన సందర్భంలో శిలీంధ్రాలు ఆశించి కుళ్లిపోయే ప్రమాదం ఉంది. కాయలకు 6 నుంచి 7సెంటీమీటర్ల తొడిమ ఉండేటట్లు చూసుకోవాలి. కాయల మీద ఉండే చర్మానికి సొన(జిగురు) అంటకుండా జాగ్రత్త తీసుకోవాలి. కాయ కోసిన తర్వాత తప్పనిసరిగా సొన(జిగురు) పూర్తిగా కారేలా చూడాలి. తర్వాత తొడిమలను 0.5 నుంచి 1 సెంటీమీటర్‌ వరకు ఉండేలా పదునైన కత్తితో కత్తిరించాలి. వాటిని తలకిందులుగా పెట్టి రెండుమూడు గంటలపాటు కదిలించకుండా ఉంచాలి. అప్పుడే కాయల నుంచి సొన సజావుగా నేల మీదికి కారుతుంది. కోతల సమయంలో కాయలపై చిన్న మచ్చగానీ, దెబ్బగానీ తగలకుండా జాగ్రత్త పడాలి. కోసిన కాయలను మట్టినేలపై ఉంచకూడదు.

శుభ్రపర్చడం ముఖ్యం

మామిడి కాయలను శుభ్రపరచడం చాలా అవసరం, 10 గ్రాముల డిటర్జంట్‌ను 10 లీటర్ల నీటికి కలిపిన ద్రావణంలో కడగాలి. తర్వాత 52 సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత గల వేడినీటిలో 200 పీపీఎం సోడియం హైపోక్లోరైడ్‌ కలిపి 2 నుంచి 3 నిమిషాల పాటు ఉంచాలి. రవాణా సమయంలో ఆంత్రాక్నోస్‌, పండు ఈగల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు కాయలను 48+0.3 సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత కలిగిన నీటిలో గంట సేపు శుద్ధి చేయాలి. కాయలపై ఉన్న తేమ ఆరే వరకు నీడలో ఆరబెట్టాలి. 300–350 గ్రాముల బరువు ఉండేటట్లు గ్రేడింగ్‌ చేసుకుని, అట్టపెట్టెలలో 10 నుంచి 13 కాయలు అమర్చి ప్యాకింగ్‌ చేసుకోవాలి. ప్యాంకిగ్‌ కోసం టెలిస్కోపిక్‌ కార్గేటెడ్‌ ఫైబర్‌ బోర్డు బాక్సులను వాడాలి. వీటిని ఆరుగంటలలోపే ప్యాక్‌హౌజ్‌కు తరలించాలి. విదేశాలకు ఎగుమతి చేయాల్సిన పండ్లకు తప్పనిసరిగా ఇర్రాడియేషన్‌ చేయించాలి. ఒకసారి కోతకు ఉపయోగించిన పనిముట్లను మళ్లీ వాడాల్సి వస్తే వాటిని తప్పనిసరిగా శుభ్రం చేయాలి.

ఇథిలిన్‌తో మాగించాలి

మామిడి కాయలను వ్యాపారులు కార్బైడ్‌ అనే రసాయనాన్ని ఉపయోగించి కృత్రిమంగా మాగిస్తున్నారు. దీనివలన కాయ మంచి రంగు వస్తుంది కాని రుచి ఉండదు. పైగా అనారోగ్యానికి కారణమవుతోంది. రైతులు, వ్యాపారులు కార్బైడ్‌తో మాగించడానికి స్వస్తి పలికి ఆరోగ్యవంతమైన పద్ధతుల ద్వారా మాగించాలి. అప్పడే రుచి, శుచి లభిస్తాయి. ఈ రెండు ఉంటే మంచి ధర లభిస్తుంది. ఇథిలిన్‌తో మామిడి కాయలను మాగించడం అన్నివిధాలా మంచిది. ఇథిలిన్‌ అనేది గ్రోత్‌ హార్మోన్‌.. ఇది అన్నిచోట్ల లభ్యమవుతుంది. 10 లీటర్ల నీటికి ఒక మిల్లీలీటర్‌ ఇథిలిన్‌ కలిపిన ద్రావణంలో మామిడి కాయలను ముంచి నీడలో ఆరబెట్టిన తర్వాత గదిలో మామిడిని పోసి వరిగడ్డి కప్పితే 14 గంటల్లోనే మంచి రంగు, సువాసన వస్తుంది. ఇలా మామిడిని మాగించడం ఆరోగ్యదాయకం.

ఫ అనుముల క్లస్టర్‌ ఉద్యానవనశాఖ అధికారి కొంపెల్లి మురళి సూచనలు

Advertisement
 
Advertisement
Advertisement