నల్లగొండ టౌన్: ప్రభుత్వం రూపొందించిన విధివిధానాల ప్రకారమే ధాన్యం సేకరణ చేయాలని రైతు కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. శనివారం ఆయన నల్లగొండ సమీపంలోని ఆర్జాలబావి, ఎస్‌ఎల్‌బీసీ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యం అమ్మిన తర్వాత మిల్లులకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఎవరైనా రైతులను రైస్ మిల్లులకు పంపిస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలన్నారు. కొనుగోలు కేంద్రాలలోని ధాన్యపు రాశులు, తేమ, తాలు, తరుగు వివరాలను తెలుసుకున్న అనంతరం ఆయన ధాన్యాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం రైతులు, హమాలీలు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల ప్రమేయం ఉండరాదని, ధాన్యం అమ్మిన వెంటనే రైతుకు రశీదు ఇవ్వాలని సూచించారు. తాలు, తరుగు, తేమ సమస్యలుంటే రైతులు కొనుగోలు కేంద్రంలోనే పరిష్కరించుకోవాలని, మిల్లర్లకు సమస్య ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించుకోవాలని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం క్వింటాల్‌కు రూ.45 మాత్రమే హమాలీ ఛార్జీ తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తరుగు, తాలు, తూకం పేరిట మిల్లుల వద్ద లారీలను ఆపుతున్నారని, లారీకి 10 క్వింటాళ్ల చొప్పున తరుగు తీస్తున్నారని పలువురు రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, గోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్‌రెడ్డి, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాంపతినాయక్, తహసీల్దార్ పరశురాం, నాయకులు గుమ్మల మోహన్‌రెడ్డి, బుర్రి శ్రీనివాసరెడ్డి, ఆదర్శ రైతు రామిరెడ్డి పాల్గొన్నారు.
ఫ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి


